● విద్యుత్ శాఖ మట్టి అక్రమ తరలింపు
● రాత్రికి రాత్రే కొల్లగొట్టిన వైనం
ముత్తుకూరు(పొదలకూరు): విద్యుత్ శాఖ భవన నిర్మాణ పునాదుల కోసం తవ్విన మట్టిని బుధవారం రాత్రికి రాత్రే అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమంగా తరలించారు. జేసీబీని ఉపయోగించి మట్టిని కొల్లగొట్టారు. ఈ తంతును గమనించిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. మండలంలోని బ్రహ్మదేవం గ్రామంలో విద్యుత్ శాఖ భవన నిర్మాణం కోసం తవ్విన పునాదుల మట్టిని కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచేశారు. మరీ ఇంత దిగజారి అక్రమాలకు పాల్పడడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విద్యుత్‌శాఖ కాంట్రాక్టర్లు ఎలా స్పందిస్తారోనని వేచి చూస్తున్నారు. అధికార అండతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నా ప్రశ్నించే వారు లేరని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికే అటవీ, రెవెన్యూ, ప్రైవేటు భూములను వదలకుండా మట్టి, గ్రావెల్‌ను తరలిస్తున్న ముఠాలు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం తవ్విన మట్టిని కూడా వదలడం లేదు. ఈ అక్రమాలను కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


