కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నిత్యం నీతులు వల్లించే సోమిరెడ్డి అవినీతి అనకొండ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. సొంత ఆస్తులనే త్యాగం చేశానని చెప్పుకొనే ఆయన ఎవరి కోసం త్యాగం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. దేవుడి భూమిని కాజేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడమే కాకుండా అధికారులతో కూడా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్న ఘనుడని ఎద్దేవా చేశారు.
పెద్ద మనిషనే ఉద్దేశంతో మధ్యవర్తిగా ఉండి పంచాయితీ చేస్తారని డబ్బులను సోమిరెడ్డి దగ్గర ఇరుపక్షాలిస్తే.. పరిష్కారమయ్యాక వారికివ్వకుండా కొట్టేశారని టీడీపీ కార్యకర్తలే వాపోతున్నారని చెప్పారు. సోమిరెడ్డి గెలుపుపై పందెం కాసిన నేతలు, కార్యకర్తలను పిలిచి ఆ మొత్తంలో వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడాన్ని చూసి విస్తుపోవడం వారి వంతవుతోందని విమర్శించారు. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీలో పర్సంటేజీలు వసూలు చేయడం.. బదిలీలకు వచ్చే చిరుద్యోగులను వదలకుండా మామూళ్లను దండుకుంటున్నారని ఆరోపించారు.
నగరంలోని శ్రీనివాస మహల్ వద్ద జేబులు కొట్టే అలవాటు సోమిరెడ్డికి గతంలో ఉండేదని, ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తూ.. ఇంటికెళ్లిన వారి జేబులు తడుముతున్నారంటూ ఆ పార్టీ నేతలే కథలుగా చెప్తున్నారని ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి కారెక్కాలంటేనే కాంట్రాక్టర్లు, అధికారులు, వ్యాపారులు భయపడుతున్నారని చెప్పారు. టీడీపీ సర్కార్ కొలువుదీరాక ప్రభుత్వ భూములతో పాటు, దేవుడి మాన్యాలు సైతం దోపిడీకి గురవుతున్నాయని ధ్వజమెత్తారు. కాకుటూరు శివాలయానికి దాత హరిప్రసాద్‌రెడ్డి ఇచ్చిన 48 సెంట్ల భూమిని రూ.కోటికి లేఅవుట్ యజమానులకు విక్రయించి సొమ్ము చేసుకుంది వాస్తవం కాదానని ప్రశ్నించారు. వీటిని కాపాడాలంటూ దేవదాయ శాఖ కార్యాలయ ఎదుట భక్తులు నిరసన తెలియజేస్తే, వారి మనోభావాలను దెబ్బతీసేలా హేయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దేవస్థానం కోసం రోడ్డు వేశాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమిరెడ్డి నోరుతెరిస్తే అవినీతి కంపును సర్వేపల్లి ప్రజలు భరించలేకపోతున్నారని చెప్పారు. దేవాలయ భూమిని విక్రయించడం అన్యాయమని ప్రశ్నిస్తున్న తనపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పిరికిపందలు పెట్టే కేసులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు.
సర్వేపల్లిలో ఇసుక, గ్రావెల్, మట్టి, బూడిదను దోచుకుంటూ, బల్కర్ల నుంచి రౌడీ మామూళ్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్ట్‌ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పామాయిల్ అసోసియేషన్ పేరిట డబ్బుల కోసం సోమిరెడ్డి బెదిరిస్తున్నారంటూ ట్యాంకర్ యజమానులు మీడియా ఎదుట వాపోయారంటేనే ఆయన దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఆయన అవినీతిని ప్రజలకు తెలియజేస్తున్న ‘సాక్షి’పై కక్షగట్టి కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
జైల్లో పెట్టించినా ఆయన అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామన్నారు. కోర్టులో ఫైళ్ల అదృశ్యం కేసుపై సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చినా.. సోమిరెడ్డి తన అనుకూల పత్రికల్లో అసత్యాలు రాయిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. శివాలయ భూములపై కలెక్టర్ విచారణ జరిపించి, ప్రభుత్వానికి నివేదించి.. వీటిని పరిరక్షించి భక్తుల మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు.


