బాలజీనగర్ ఇన్ స్పెక్టర్ అదుపులో జూదరులు
పెచ్చుమీరుతున్న నేరాలు
చేష్టలుడిగి చూస్తున్న పోలీస్ శాఖ
సింహపురిలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై చేష్టలుడిగి చూస్తుండటంతో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. గంజాయి, మద్యం మత్తులో విచక్షణరహితంగా పీకలు కోస్తూ.. హత్యలకూ తెగబడుతున్నారు. జిల్లాలో ఎటు చూసినా నేరప్రవృత్తి పెరిగిపోతోంది. విచ్చలవిడిగా గంజాయి, మద్యం అమ్మకాలు, పేకాట, వ్యభిచార గృహాల నిర్వహణతో అసాంఘిక కార్యకలాపాలు మితిమీరాయి. తమ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారంటూ గంజాయి ముఠాలు ఏకంగా తరిమితరిమి చంపిన ఉదంతం మర్చిపోకముందే.. తాజాగా తమ బైక్‌కు దారివ్వలేదని సిటీ బస్సు డ్రైవర్ పీక కోశారు. అడ్డుకోబోయిన కండక్టర్‌పై కత్తులతో దాడి చేశారు. ఇదంతా చూస్తుంటే నెల్లూరుకు ఏమైందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ఎవరేమి చేస్తారోననే భయం ప్రజలను వెంటాడుతోంది. గత నెల 28న ఉద్యమకారుడు పెంచలయ్య హత్యను మరువకముందే.. మద్యం మత్తులో కొందరు యువకులు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై బ్లేడ్లతో విచక్షణరహితంగా ఆదివారం పట్టపగలు దాడి చేసిన ఉదంతం నగర వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. అధిక శాతం నేరాలు మత్తులోనే జరుగుతున్నాయి.
పోలీసులపైనా దాడులు
శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజారక్షణ చర్యల్లో భాగంగా నిరంతర తనిఖీలు, నేరస్తుల కదలికలపై నిఘా, రౌడీషీటర్లపై పీడీ యాక్ట్‌లను పోలీస్ అధికారులు నమోదు చేస్తున్నా, నేరాలు అదుపులోకి రావడం లేదు. ఖాకీలపై దాడులు చేసేందుకు సైతం నిందితులు వెనుకాడటం లేదు. నేరాల కట్టడికి మరింత దూకుడును పెంచాల్సిన అవసరాన్ని వరుస ఘటనలు తెలియజేస్తున్నాయి.
నూతన ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి
టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి నేరాలు పెరుగుతున్నాయి. నేరస్తుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. పాతకక్షలు కత్తులు దూస్తున్నాయి. కిరాయి సంస్కృతి పెచ్చుమీరుతోంది. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అసాంఘిక శక్తులు, అల్లరిమూకలు మత్తులో వీరంగం చేస్తున్నాయి. మత్తుకు బానిసలైన వారు తమ అవసరాలకు సరిపడా నగదు కోసం హత్యలకూ వెనుకాడటం లేదు. పెన్నా సమీపంలో జరిగిన జంట హత్యలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదంటూ స్థానికులపైనా దాడులు చేస్తున్నారు.
బాధితుల ఫిర్యాదులతో పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. లేడీ డాన్, దేవరకొండ సుధీర్, హసన్ గ్యాంగ్‌లతో పాటు పలువురు రౌడీషీటర్ల వద్ద పెద్ద ఎత్తున గంజాయిని ఇటీవల స్వాధీనం చేసుకొని జైళ్లకు పంపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ఓ ధర్మకాటా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 117 మద్యం బాటిళ్లను సంతపేట పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. బెల్టుషాపుల్లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం, గంజాయిని పూర్తిస్థాయిలో కట్టడి చేయడంతో పాటు నేరస్తులపై మరింత కఠినంగా వ్యవహరించాలని నగర వాసులు కోరుతున్నారు.
జోరుగా అసాంఘిక కార్యకలాపాలు
జిల్లాలోని కొందరు నిర్వాహకులు ఇళ్లు, లాడ్జిలను వేదికగా చేసుకొని పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొన్ని లాడ్జిల నిర్వాహకులతో ముందస్తు ఒప్పందాలు కుదర్చుకొని వారాల తరబడి ఆడిస్తున్నారు. నగరంలోని రెండు లాడ్జిలపై పోలీసులు దాడులు చేసి నిర్వాహకులతో పాటు జూదరులను అరెస్ట్ చేసి రూ.లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి.


