నూడకు భూ సమర్పయామి
వింజమూరులో రూ.70 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కట్టబెట్టేందుకు యత్నం
రెవెన్యూ అధికారుల ప్రతిపాదనలు
వాస్తవానికి 1978లోనే ఎస్టీలకు ఇవి కేటాయింపు
సాగులో లేవంటూ స్వాధీనం చేసుకున్న వైనం
భూముల ధరలు పెరగడంతో అధికార పార్టీ పెద్దల కన్ను
భవిష్యత్తు అవసరాల విస్మరణ
ఉదయగిరి నియోజకవర్గంలో విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉన్న వింజమూరులో విలువైన ప్రభుత్వ భూములపై తమ్ముళ్ల కన్ను పడింది. పట్ణణ భవిష్యత్తు అవసరాలను విస్మరించి సుమారు రూ.70 కోట్ల విలువజేసే ల్యాండ్‌ను నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా)కి అప్పనంగా కట్టబెట్టేందుకు ఫైల్‌ను రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. నియోజకవర్గ ముఖ్య నేత ఆదేశాల మేరకు కావలి – దుత్తలూరు జాతీయ రహదారి పక్కనే (జగనన్న లేఅవుట్‌ను ఆనుకొని) ఉన్న దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. నుడా అని పైకి చెప్తున్నా, ఆ ముసుగులో విలువైన భూములను కొట్టేసే కుట్ర కోణముందనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
వింజమూరు (ఉదయగిరి): పట్టణాభివృద్ధి వద్దు.. తమ స్వలాభమే ముద్దు అనే రీతిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. వింజమూరులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. ఇక్కడి విలువైన ప్రభుత్వ భూమిపై వీరు కన్నేశారు. వాస్తవానికి వింజమూరు నుంచి దుత్తలూరు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో జీబీకేఆర్ ఎస్టీ కాలనీని ఆనుకొని జాగీర్ వనం వరకు ఉన్న భూముల ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇక్కడ అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లను ఏర్పాటు చేయగా, స్తిరాస్థి వ్యాపారం జోరుగా సాగుతోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 400 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాలను ఉచితంగా ఇచ్చి.. జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో అనేక మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు.
సంపద సృష్టంట..!
గ్రామ సర్వే నంబర్ 839, 1599, 1602, 1603, 1604, 1605, 1608, 1611, 1614, 1616లో 94.53 ఎకరాలను నుడాకు ఇచ్చే అంశమై జిల్లా అధికారులకు ప్రతిపాదనలను తహసీల్దార్ హమీద్ పంపారు. ఈ తరుణంలో భూములను జేసీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పది రోజుల క్రితం పరిశీలించారు. ఈ క్రమంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా, సంపద సృష్టి కోసం అంటూ వాటిని తిరస్కరించారు. ఈ పరిణామాల క్రమంలో భూములు నుడాకు అప్పగించే ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏదీ ముందస్తు ప్రణాళిక..?
ఉదయగిరి నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్ణణం వింజమూరు. త్వరలో నగర పంచాయతీ హోదా వచ్చే అవకాశం ఉందని సమాచారం. రెవెన్యూ డివిజన్‌గా మార్చేందుకూ అవకాశాలున్నాయి. ఇక్కడ గురుకుల పాఠశాల, పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాలలు, మోడల్ స్కూల్, పట్ణణ ప్రజల క్రీడా అవసరాల నిమిత్తం మినీ స్టేడియం తదితరాలను కేటాయించే ఛాన్స్ ఉంది. పారిశ్రామికవాడకు ల్యాండ్స్‌ను కేటాయించాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. ఈ తరుణంలో పట్టణ ప్రగతికి ఇవెంతో కీలకం. అయితే వీటిన్నింటినీ నుడాకు కేటాయిస్తే భవిష్యత్తులో ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
భూముల ధరలకు రెక్కలు
2022లో జాతీయ రహదారి రావడంతో ఈ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో మామిడి తోటలను కొంతమంది ఎస్టీలు సాగు చేస్తున్నారు. భూముల పరిశీలన నిమిత్తం ఇటీవల వచ్చిన ఎమ్మెల్యే, జేసీ ఎదుట తమ సమస్యను వీరు లేవనెత్తారు. భూముల్లో ప్లాట్లేసి విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే అభివృద్ధి చేయాలంటూ శాసనసభ్యుడు చెప్పడంతో వీరు అవాక్కయ్యారు. అర్హత ఉన్నవారికి వేరే చోట ఇస్తామని తెలిపారు. విలువైన భూములను లాక్కొని.. ఎక్కడో తమకెందుకని అవేదన వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువజేసే భూములను కాజేసేందుకు నుడా పేరుతో ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గతంలో ఇలా..
నుడాకు ప్రతిపాదించిన సర్వే నంబర్లలో జీబీకేఆర్ కాలనీకి చెందిన 53 మంది ఎస్టీలకు 130 ఎకరాలకు లీజు పట్టాలను సీజేఎఫ్‌ఎస్ పేరుతో 1978లో అప్పటి ప్రభుత్వం అప్పగించింది. వీటిలో కొంత మేర విక్రయించగా, మరికొన్నింటిని సాగు చేయకుండా వదిలేశారు. ఈ తరుణంలో భూములను అన్యాక్రాంతం చేశారంటూ 2010, జూలైలో లీజు ఉత్తర్వులను రద్దు చేస్తూ అనాధీనంగా అప్పటి కావలి ఆర్డీఓ వెంకటేశ్వర్లు మార్చారు. ఈ తరుణంలో కోర్టును కొందరు ఆశ్రయించగా, భూముల్లేని పేదలకు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మండలంలోని రావిపాడులో డీ ఫారం పట్టాలను కొందరికి ఇచ్చారు. గతంలో ఇచ్చిన లీజును రద్దు చేసినా, వాటిని కొందరు సాగు చేసుకుంటున్నారు.
పరిశీలించి.. తగు నిర్ణయం తీసుకుంటాం
వింజమూరులో నుడాకు భూముల కేటాయింపు కోసం ప్రతిపాదనలొచ్చాయి. వీటిని పరిశీలించాం. అన్ని విషయాలను పరిగణించి తగు నిర్ణయం తీసుకుంటాం. – మొగిలి వెంకటేశ్వర్లు, జేసీ


