‘పొదుపు’లో గోల్‌మాల్
● గ్రూపుల వద్ద వీఓఏల చేతివాటం
● కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు
కలువాయి(సైదాపురం): మండలంలోని పొదుపు సంఘాల గ్రూపులకు లోన్లు ఇప్పిస్తూ వీఓఏలు భారీ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కలువాయి మండలంలో ఎన్‌ఆర్‌ఎల్ పోర్టల్ ద్వారా లోన్ అఫ్రూవల్ కోసం మోక్రో క్రెడిట్ ప్లాన్ ఇచ్చేందుకు మండల స్థాయి ఏపీఎంలకు వెయ్యి, వీఓఏ, సీసీకి రూ.4 వేలు నుంచి రూ.10 వేలు ఇలా బ్యాంకు దగ్గరకు లోన్ కోసం వచ్చే ప్రతి పొదుపు గ్రూప్ దగ్గర వీఓఏలు నగదు తీసుకుంటున్నారు.
సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లు
ఏ బ్యాంక్ అయినా పొదుపు గ్రూపులకు రుణం ఇచ్చేందుకు లోన్ సెట్‌లను ఉచితంగా ఇచ్చి వివరాలు పొందుపరిచి అప్రూవల్స్ చేయాల్సి ఉంది. ఇయితే అందుకు భిన్నంగా బ్యాంకులో ఉండాల్సిన లోన్ సెట్లను వీఓఏలకు అప్పజెప్పి బ్యాంక్ మేనేజర్ సైతం సహకరిస్తున్నట్లు పొదుపు మహిళలు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో వెంకట్రామరాజుపేట గ్రామానికి చెందిన బాపూజీ, పూజిత గ్రూపులకు లోన్లు ఇచ్చేందుకు వీఓఏకు బ్యాంకు లోన్‌సెట్ల డబ్బులు చెల్లించి మరీ లోన్‌కు వెళ్లిన పరిస్థితి. లోన్ అప్రూవల్ కాగానే వెంటనే వారి వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేసే సమయంలో ఆ సంఘ వీఓఏలకు వారు అడిగిన నగదు చెల్లిస్తేనే మేనేజర్లకు చెప్పి నగదు జమ చేయిస్తున్న సందర్భం కుల్లూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో నెలకొంది. పీజీఆర్‌ఎస్‌లో సైతం కుల్లూరు గ్రూపులలో అవినీతి జరుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సాయిబాబా గ్రూప్ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏపీఎం రవి, కుల్లూరు క్లస్టర్ సీసీ ధనమ్మతో గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. కుల్లూరు సంధ్యా గ్రూపులో ఒక సభ్యురాలికి రూ.50 వేల రుణం ఇస్తూ అక్కడికక్కడే వీఓఏ రూ.1500ల నగదు తీసుకున్నట్లు తెలిసింది.
వీటిపై చర్యలేవీ
గతంలో కలువాయి వీఓఏ బినామీ పేర్లతో వీఓఆర్‌ఎఫ్ కింద రూ.60 లక్షలు తీసుకుని ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా చెల్లించలేదు. దీనిపై మండలాధికారులకు వాటాలు వెళ్తుంటే ఇక రీకవరీలు ఏమీ జరుగుతాయని పొదుపు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాదన్నగారిపల్లి, దాచూరు, తోపుగుంట గ్రామాల్లో పనిచేస్తున్న వీఓఏలను ఇటీవల టీడీపీ నాయకులు తొలగించి అనుకూలమైన వారికి నియమించుకున్నారు. నాయకులకు బినామీ పేర్లతో ఒక కుల్లూరు గ్రామంలోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కింద 20 మందికి అప్రూవల్ పెట్టి రూ.50 వేలు నుంచి రూ.75 వేలు లోన్ తీసుకునే సదుపాయాన్ని రెడీ చేసుకున్నారు. అలాగే గ్రామ నిధి అని పొదుపులో ఉన్న మహిళలకు బినామీ పేర్లతో 15 మందికి రూ.50 వేల చొప్పున తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.30 లక్షల మేర అవినీతికి పాల్పడిన సీసీ భవాని సస్పెండ్ అయినా అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. గతంలో వెలుగు సీసీగా పనిచేసిన పుల్లయ్య పెరంకొండలో సంఘం బంధం నుంచి రూ.లక్ష నగదు హెచ్‌డీ అమౌండ్ స్వాహా చేసినా ఒక్క రూపాయి రికవరీ చేయలేదు. పర్లకొండ, చీపినాపి, వేదనపర్తి, నూకలపల్లి, తెలుగురాయపురం గ్రామాల్లో బినామీ పేర్లతో స్వాహా చేయడమే వీఓఏల ముఖ్య ఉద్దేశం. న్యూట్రీ గార్డెన్ కింద రూ.15 లక్షల గోల్‌మాల్ జరిగినా అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రమైన కలువాయిని వదిలి కేవలం కుల్లూరు క్లస్టర్ పైనే వెలుగు అధికారులు కపట ప్రేమ చూపించడం పట్ల ఉన్నతాధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పొదుపు మహిళలు కోరుకుంటున్నారు.


