టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు శనివారం నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రెమిడియల్ క్లాసులు, 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా సబ్జెక్టులపై అవగాహన ఉంటుందన్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు చిన్నారులకు సూచించిన సబ్జెక్టులపై అసెస్‌మెంట్ చేయాలన్నారు. పేపర్లను ఆయా రోజు వాల్యుయేషన్ చేసి ఆన్‌లైన్‌లో మార్కుల ఎంట్రీతో పాటు విద్యార్థులతో రివ్యూ చేయాలన్నారు. ఏ, బీ గ్రూపు విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్, సీ, డీ గ్రూపు విద్యార్థులకు రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఈ వంద రోజుల పాటు విద్యార్థులు సెలవు పెట్టకుండా తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు త్రికరణ శుద్ధితో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.


