హామీకి టీడీపీ కట్టుబడాలి
● పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
కోట: గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపే విషయమై ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీపై సీఎం చంద్రబాబునాయుడు కట్టుబడి ఉండాలని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆయన అల్లంపాడులో శనివారం మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని చంద్రబాబు గూడూరులో జరిగిన సభలో హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా కోటలో జరిగిన యువగళం పాదయాత్ర బహిరంగ సభలో లోకేశ్ కూడా హామీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నేతలు సైతం గూడూరు సెగ ఢిల్లీకి చేరేలా తమ గళాన్ని వినిపించాలన్నారు. ప్రజల మనోభావాలను ప్రతి పార్టీ గౌరవించాలన్నారు. నాడు ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. అప్పుడు ఎక్కడా సమస్య రాలేదన్నారు. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పడం వల్లే గూడూరు ప్రజలు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారన్నారు. గూడూరుపై తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి, సర్పంచ్ ఈశ్వర్‌రెడ్డి, ఉప సర్పంచ్ దేవరాల రాంబాబు పాల్గొన్నారు.


