వర్సిటీ స్థాయి అథ్లెటిక్స్ మీట్ ప్రారంభం
కావలి (అల్లూరు): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్థాయి అథ్లెటిక్స్ మీట్ శనివారం కావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ తొలి నుంచి జవహర్ భారతి కళాశాల క్రీడలకు ఆటపట్టు అని, గెలుపోటములను స్వీకరించే క్రీడా స్ఫూర్తిని క్రీడాకారులు అలవర్చుకోవాలని కోరారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ సీహెచ్ వెంకట్రాయలు మాట్లాడుతూ గెలుపు కోసం పోరాడే నైపుణ్యాలు, పోరాట పటిమలను క్రీడల్లో పాల్గొనడం వల్ల అలవడుతాయని తెలియజేశారు. అథ్లెటిక్ మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి.ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులందరూ పోటీల్లో ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ ఎ.ప్రవీణ్‌కుమార్ అథ్లెటిక్ మీట్ పురుషుల జట్లకు పరిశీలకుడిగా, సూళ్లూరుపేట డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అమ్మాజీ సీ్త్రల జట్లకు పరిశీలకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో వివిధ డిగ్రీ కళాశాలల వ్యాయామ అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారు.


