నాడు.. రైతే.. రారాజు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాపై ఇటీవల తుఫాన్లు చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించగా, పొలాలు చెరువులను తలపించాయి. మోంథాతో అరటి తోటలు, వరి, వేరుశనగ పంటలను రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా దిత్వాతో వేలాది ఎకరాల్లో నారుమడులు, నాట్లు, శనగ పంటలు దెబ్బతిని అన్నదాతలు నిండా మునిగిపోయారు. ఇంత జరుగుతున్నా, కర్షకులను ఆదుకునే అంశంలో ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పరిహారం మాట అటుంచితే.. రైతులను కనీసం పరామర్శించాలనే ఆలోచన సైతం వీరికి రాలేదు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా, ప్రయోజనం శూన్యం. సమీక్ష జరిపి నష్ట నివేదికను రూపొందించాలనే ధ్యాసా కరువైంది.
కష్టం నీటిపాలు
అక్టోబర్ 27, 28న సంభవించిన మోంథా తుపాన్‌తో 1320 హెక్టార్లలో కోతకొచ్చిన వరి.. 44.9 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇవన్నీ అధికారిక లెక్కలే. పంట నష్టపోయిన అన్నదాతలు, పాడి రైతులకు రూపాయి సాయం నేటికీ అందలేదు. ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వకపోవడం.. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేయడంతో కర్షకులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల తీవ్రతకు 24 పెద్ద పశువులు, ఏడు గొర్రెలు, 600 కోళ్లు మృతి చెందాయి.
ప్రజలకూ పంగనామాలే..
మోంథా తుఫాన్ సమయంలో లోతట్టు ప్రాంతాల్లో 11 వేల మంది ప్రజలు కష్టాలు పడగా, వీరిలో 3977 మందిని 117 పునరావాస కేంద్రాలకు తరలించామని మొదట ప్రకటించారు. ఈ తరుణంలో నిత్యావసర సరుకుల పంపిణీపై ప్రభుత్వం ప్రకటన చేయగానే, టీడీపీ నేతల కోసం ఈ సంఖ్యను 8930కు పెంచారు. మొత్తమ్మీద రూ.96.27 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారికంగా ప్రకటించినా, ఈ సంఖ్య వాస్తవంగా ఎక్కువే. రిలీఫ్ క్యాంపులకు తరలించిన వారికి తుఫాన్ తీవ్రత తగ్గిన నాలుగైదు రోజుల తర్వాత 25 కిలోల బియ్యం, కందిపప్పు, చక్కెర, ఎర్రగడ్డలు, బంగాళాదుంపలను కిలో చొప్పున, లీటర్ పామాయిల్‌ను అరకొరగా అందజేశారు. అధికార పార్టీకి సంబంధించిన స్థానిక నేతల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరగడంతో తమ వారికే పంపిణీ చేయించుకున్నారు.
అండగా నిలిచిన వైఎస్సార్సీపీ శ్రేణులు
దిత్వా సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కనీసం పునారావాసాలకు తరలించలేదు. దీంతో బాధితులకు భోజన సదుపాయాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మరికొందరు కల్పించారు. ఈ పరిణామాల క్రమంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలతో అనంతసాగరం మండలంలో పాచిపోయిన నారుమడులు
ముంచిన దిత్వా
దిత్వా తుఫాన్ నాటికి జిల్లాలో వేలాది ఎకరాల్లో నాట్లేశారు. అధికారిక లెక్కల మేరకు 6970 హెక్టార్లలో నాట్లు, నారుమడులు.. 557.5 హెక్టార్లలో శనగ పంట దెబ్బతినిందని ప్రకటించారు. వాస్తవానికి డెల్టా ప్రాంతంలోనే వేలాది ఎకరాల్లో నాట్లు జరుగుతున్నాయి. సుమారు 25 వేల ఎకరాల్లో వరినాట్లు, నారుమడులు మునిగి కుళ్లిపోతున్నాయి. పొలాల నుంచి వరద నీరు పూర్తిస్థాయిలో ఇప్పటికీ బయటకెళ్లలేదు. దీంతో నాట్లేసిన రైతులు ఎకరాకు రూ.30 వేల చొప్పున.. నారుమడులేసిన వారు ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున నష్టపోయారు. ఇంత జరిగినా మంత్రులు నారాయణ, రామనారాయణరెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. నష్టంపై సమీక్షా జరపలేదు. తూతూమంత్రంగా ఎన్యూమరేషన్ చేసి నష్టాన్ని తగ్గించి చూపి కాకి లెక్కలేశారు. మరోవైపు రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి తాను లేఖ రాశానని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గొప్పలు చెప్పుకొన్నారు. అయితే క్షేత్రస్థాయిలో సాయమందించిన దాఖలాల్లేవు.
తుఫాన్ల తాకిడికి కుదేలు
పరిహారం లేదు..
పరామర్శపై ధ్యాసేదీ..?
మోంథా నష్టంపై మొక్కుబడిగా
ఎన్యూమరేషన్
దిత్వాతో సమస్య మరింత తీవ్రం
సమీక్షలు సైతం జరపని అధికారులు, మంత్రులు
అన్నదాత పరిస్థితి దయనీయం
35 రోజుల వ్యవధిలో జిల్లాపై మోంథా, దిత్వా తుఫాన్లు పంజా విసిరాయి. వీటి ప్రభావానికి కురిసిన భారీ వర్షాలతో అన్నదాతలు కుదేలయ్యారు. పంట నష్టపోయి దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో వీరికి భరోసానివ్వాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయమే దండగ అంటూ గతంలో ప్రకటించిన చంద్రబాబు.. ప్రస్తుతం అదే పోకడను అవలంబిస్తూ రైతులపై నిర్దయ చూపుతున్నారు. దిక్కుతోచక విలవిల్లాడుతున్న కర్షకులకు పరిహారాన్ని అందించే విషయం పాలకులకు ఏ మాత్రం పట్టడంలేదు. గతంలో ఇలాంటి విపత్తులు ఎదురైన సమయాల్లో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఉదారంగా స్పందించి వీరికి చేయూతనిచ్చేవారు. అప్పటికీ.. ఇప్పటికీ మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తున్న రైతులు.. ప్రస్తుత సర్కార్ తీరుపై భగ్గుమంటున్నారు.
ప్రకృతి విపత్తులనేవి సర్వ సాధారణం. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనూ ప్రకృతి ప్రకోపానికి ఇవి సంభవించాయి. అయితే ఆ సమయంలో సీఎంగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అండగా నిలిచారు. సబ్సిడీపై విత్తనాలు.. ఉచిత పంటల బీమా ద్వారా అన్నదాతలకు భరోసానిచ్చారు. అయితే ప్రస్తుతం ఇవేవీ అందించకుండా సర్కార్ నిర్లిప్త ధోరణిని అనుసరిస్తోంది. ఇప్పటి కూటమి సర్కార్‌ను.. నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రైతులు బేరీజేసుకుంటున్నారు. టీడీపీ సర్కార్ తీరుతో తాము తీవ్రంగా నష్టపోయామనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.


