రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
నెల్లూరు(లీగల్): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చరిత్ర ఎంతో ఘనమైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో కార్యక్రమాన్ని నెల్లూరు బార్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్.. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పులిమి అయ్యప్పరెడ్డి, నాగరాజుయాదవ్, అసోసియేషన్ ప్రెసిడెంట్ జల్లి పద్మాకర్, న్యాయవాదులు అబ్బాయిరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, వెంకయ్య, బద్దెపూడి రవీంద్ర, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
‘డీకేడబ్ల్యూ’లో రేపట్నుంచి
స్పాట్ అడ్మిషన్లు
నెల్లూరు (టౌన్): నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో ఎమ్మెస్సీ జువాలజీ, ఎంఏ తెలుగు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లను సోమవారం నుంచి నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ గిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ సెట్ అర్హత లేకపోయినా స్పాట్ అడ్మిషన్లను పొందొచ్చని చెప్పారు. కోటాలో చేరే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని పేర్కొన్నారు. అడ్మిషన్లు, సమాచారం కోసం 94913 21150, 94415 40317 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
9న జాబ్ మేళా
నెల్లూరు (టౌన్): మద్రాస్ బస్టాండ్ సమీపంలోని వీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్‌లో జాబ్ మేళాను ఏపీఎస్సెస్డీసీ, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్, సీడాప్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్నామని కళాశాల డైరెక్టర్ తనూజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులని.. ఆధార్ కార్డు జిరాక్స్, బయోడేటాను తీసుకురావాలని కోరారు. వివరాలకు 63016 28981, 99888 53335 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారిని 67,336 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 25,063 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి


