అంబేడ్కర్ మహనీయుడు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): అణగారిన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితకాలం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శనివారం నివాళులర్పించిన అనంతరం కాకాణి మాట్లాడారు. రాష్ట్రంలో నారావారి రాజ్యాంగాన్ని టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. అరాచక పాలనను సీఎం చంద్రబాబు సాగిస్తూ.. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ.. జైళ్లకు పంపి హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. అణగారిన వర్గాలు, మహిళలపై దాడులు చేస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని విమర్శించారు. పేదలకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్రతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ ఆశయసాధన కోసం మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడ్డారని గుర్తుచేశారు.


