నకిలీ డీఏపీ కలకలం
● గతేడాదీ ఇదే తరహాలో
● రైతులను మోసం చేస్తున్న
కొందరు వ్యాపారులు
మర్రిపాడు: రబీ సీజన్ ప్రారంభమవడంతో రైతుల కష్టాన్ని దోచుకునేందుకు నకిలీ వ్యాపారులు సిద్ధమయ్యారు. తక్కువ ధరకే డీఏపీని అందిస్తామంటూ మాటలు చెప్పి.. నకిలీని అంటగట్టేందుకు యత్నాలను ప్రారంభించారు.
జరుగుతోందిలా..
మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు డీఏపీని రూ.వెయ్యికే అందిస్తామంటూ నంద్యాలకు చెందిన కొందరు వ్యాపారులు ప్రస్తుతం చెప్తున్నారు. సాయంత్రం వేళ బుక్ చేసుకొని.. మరుసటి రోజు ఉదయం పది గంటల్లోపు అంటగట్టి నగదును తీసుకెళ్తున్నారు. అయితే ఇది నకిలీదని సమాచారం. గతేడాది సైతం ఇదే తరహాలో అందజేశారు. మండలంలోని ఇస్కపల్లికి చెందిన రైతు బత్తల రత్తయ్యకు 20 టన్నుల డీఏపీని ఇచ్చారు. దీని ద్వారా తనకు రూ.ఆరు లక్షల మేర నష్టమొచ్చిందని ఆయన వాపోయారు. మర్రిపాడు మండలంలోని కొత్త అల్లంపాడులో లోడ్‌ను తాజాగా దించారు.
రైతులు జాగ్రత్తగా ఉండాలి
మండలంలో గ్రామాల్లో నాణ్యత లేని ఎరువులు, పురుగుమందును కొందరు విక్రయిస్తున్నారని రైతులు చెప్తున్నారు. లైసెన్స్ లేకుండా ఇలా ఎవరైనా అమ్మితే వ్యవసాయాధికారికి తెలియజేయాలి. రైతులు అప్రమత్తంగా ఉంటూ.. సలహాలు సూచనల కోసం గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా ఏఓలను సంప్రదించాలి.
– కవిత, వ్యవసాయాధికారి, మర్రిపాడు
●
నకిలీ డీఏపీ కలకలం


