పీటీఎం.. పేలవంగా | - | Sakshi
Sakshi News home page

పీటీఎం.. పేలవంగా

Dec 6 2025 7:26 AM | Updated on Dec 6 2025 7:26 AM

పీటీఎం.. పేలవంగా

పీటీఎం.. పేలవంగా

నెల్లూరు (టౌన్‌): రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న మెగా పేరెంట్స్‌.. టీచర్స్‌ మీట్‌ జిల్లాలో అట్టర్‌ ఫ్లాపైంది. జిల్లాలోని 2608 ప్రభుత్వ పాఠశాలలు.. 26 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శుక్రవారం చేపట్టిన కార్యక్రమాలు నామమాత్రంగా జరిగాయి. తల్లిదండ్రులు చాలా తక్కువగానే హాజరయ్యారు. కనీసం టెంట్లు, ఫ్లెక్సీలను సైతం ఎక్కడా ఏర్పాటు చేయలేదు. అల్లీపురంలోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన సమావేశానికి జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ.. ఇతర చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

నిధుల విడుదలేదీ..?

మెగా పేరెంట్స్‌.. టీచర్స్‌ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు పాఠశాలలకు నిధులను విడుదల చేయలేదు. జిల్లాలోని 2608 పాఠశాలలకు రూ.51.43 లక్షలను విడుదల చేస్తామని ప్రకటించినా, పైసాను విదిల్చలేదు. దీన్ని ఎప్పుడిస్తారో సైతం చెప్పకపోవడంతో నిధులను వెచ్చించేందుకు హెచ్‌ఎంలు విముఖత చూపారు. ఫలితంగా ప్రక్రియ మొక్కుబడి తంతుగా మారింది.

వారొస్తేనే ఆర్భాటం

మెజార్టీ పాఠశాలల్లో తరగతి గదిలోనే మీటింగ్‌లను నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యే స్కూళ్లలోని బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించినా.. కుర్చీలు, టెంట్లను సరిపడా ఏర్పాటు చేయలేదు. కొందరు విద్యార్థులు నేలపై కూర్చోగా, మరికొందరు నిలిచే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్నాక్‌ను అందించకుండా.. రోజు తరహాలోనే మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి మమ అనిపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తల్లిదండ్రులకు ఆటల పోటీల ఊసేలేదు.

సమస్యలపై నిలదీత

మెగా పేరెంట్స్‌.. టీచర్స్‌ సమావేశాల్లో భాగంగా పాఠశాలల్లో పలు సమస్యలపై స్థానిక నేతలు, ఉపాధ్యాయులను తల్లిదండ్రులు నీలదీశారు. మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ అధిక చోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గదుల కొరత, సరిపడా ఫ్యాన్లు, బెంచీలు లేకపోవడంపై మండిపడ్డారు. నాడు – నేడు రెండో విడత పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో చాలా స్కూళ్లలో చెట్ల కిందే బోధించాల్సిన పరిస్థితి నెలకొనడంపై భగ్గుమన్నారు.

నగరంలోని బీవీఎస్‌ మున్సిపల్‌ హైస్కూల్లో ఏడో తరగతి పిల్లలను కింద కూర్చోబెడుతున్నారంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు. ఫ్యాన్లు సైతం లేవని నిలదీశారు. ఆపై విషయాన్ని కార్పొరేటర్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఆర్జీ రూపంలో ఇవ్వాలని ఉచిత సలహా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన పీటీఎంలలో ఇదే పరిస్థితి నెలకొంది.

మద్రాస్‌ బస్టాండ్‌ సమీపంలోని సుంకు చెంగన్న.. బీవీనగర్‌లోని కేఎన్నార్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ సమావేశాల్లో నాసిరకం భోజనంపై హెచ్‌ఎంలు, స్థానిక నేతలను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. దీన్ని మీరు లేదా మీ పిల్లలు తింటారానని ప్రశ్నించారు. ఆపై లంచ్‌ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మొక్కుబడిగా పేరెంట్స్‌..

టీచర్స్‌ సమావేశాలు

నామమాత్రంగా హాజరైన తల్లిదండ్రులు

నిధులు విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం

సరిపడా కుర్చీల్లేక కిందే కూర్చున్న విద్యార్థులు

నాసిరకం భోజనంపై నిలదీత

జూనియర్‌ కళాశాలల్లోనూ ఇదే తంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement