నన్ను జైలుకు పంపితే సోమిరెడ్డి అవినీతికి అడ్డుండదు | - | Sakshi
Sakshi News home page

నన్ను జైలుకు పంపితే సోమిరెడ్డి అవినీతికి అడ్డుండదు

Dec 6 2025 7:26 AM | Updated on Dec 6 2025 7:26 AM

నన్ను జైలుకు పంపితే సోమిరెడ్డి అవినీతికి అడ్డుండదు

నన్ను జైలుకు పంపితే సోమిరెడ్డి అవినీతికి అడ్డుండదు

వర్షాలొస్తే టీడీపీ నేతలకు పండగ

మరమ్మతుల పేరిట దొంగ బిల్లులు

ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ముత్తుకూరు(పొదలకూరు): తనను జైలుకు మళ్లీ పంపితే సోమిరెడ్డి అవినీతిని అడ్డుకునే వారుండరని.. దీంతో పదేపదే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా ఆయన అక్రమాలను అడ్డుకుంటూ.. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తూనే ఉంటానని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలైన ముత్తుకూరు మండలంలోని పోలంరాజుగుంట, డమ్మాయపాళెం గ్రామాల్లో రైతులతో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. నక్కల కాలువ డ్రెయిన్‌కు వెళ్లే మార్గం జలమయం కావడంతో రైతులతో కలిసి ట్రాక్టర్‌లో ప్రయాణించారు. కాలువ పనులను గత ప్రభుత్వంలో మీరు చేయడంతో ఆక్వా గుంతల్లోకి నీరు రాకుండా రక్షించుకోగలిగామంటూ వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. వర్షాలు కురిస్తే జనజీవనాన్ని నక్కల కాలువ అతలాకుతలం చేసేదని, అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. కాలువలో పూడికను తొలగించి రైతులను గత ప్రభుత్వంలో ఆదుకుంటే.. ప్రస్తుతం సోమిరెడ్డి నాలుగు గంటలు పనిచేసి గుర్రపు డెక్కను సైతం పూర్తిగా తొలగించలేదని విమర్శించారు. తన రాకను తెలుసుకొని మెషీన్‌ను హడావుడిగా తెప్పించి గుర్రపు డెక్కను తొలగించారనే అంశాన్ని రైతులే చెప్పారని పేర్కొన్నారు.

ప్రభుత్వ సొమ్ము స్వాహా

వరదలతో దెబ్బతిన్న కాలువలు, చెరువుల రిపేర్ల పేరుతో పనులు చేయకుండానే దొంగ బిల్లులను సృష్టించి ప్రభుత్వ సొమ్మును సోమిరెడ్డి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. తుఫాన్‌తో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పనులపై తండ్రీకొడుకు ప్రణాళికను రూపొందిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. నక్కల కాలువ పనులను గతంలో సజావుగా జరగనీయకుండా సోమిరెడ్డి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. పనులను తన పర్యవేక్షణలో పూర్తి చేయడంతో రైతులు, ప్రజలు ఇబ్బందుల్లేకుండా ఉన్నారని పేర్కొన్నారు. తమ హయాంలో జరిగిన పనులు.. ఇప్పుడు ఇరిగేషన్‌ శాఖలో చేస్తున్న పనులపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ శాఖలో అవినీతి ఏరులై పారుతోందని.. అధికారులు, ఉద్యోగులు ఎంతమంది శిక్షార్హులవుతారో కాలమే సమాధానం చెప్తుందన్నారు. ప్రజల కష్టాలను సోమిరెడ్డి గాలికొదిలి.. తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నష్టపోయిన రైతులు, ప్రజలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. విత్తనాలను రాయితీపై అందజేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోని పక్షంలో.. తమ పార్టీ పోరాటం చేస్తుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement