గండిపాళెం జలాశయంలో గాలింపు
ఉదయగిరి రూరల్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన సౌరభ్‌కుమార్ మండలంలోని గండిపాళెం జలాశయంలో మంగళవారం గల్లంతైన విషయం తెలిసిందే. అతని కోసం బుధవారం ఎస్సై శ్రీనివాసులు, ఫైర్ సిబ్బంది మత్స్యకారుల సహకారంతో జలాశయంలో ముమ్మరంగా గాలించారు.
గంజాయి స్వాధీనం
● పోలీసుల అదుపులో ముగ్గురు
ఆత్మకూరు: ముగ్గురు యువకుల వద్ద గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఆత్మకూరు ఎస్సై బి.సాయిప్రసాద్ వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని బట్టేపాడు మార్గంలో ముగ్గురు వ్యక్తులు గంజాయి తాగుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కొంత గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బట్టేపాడుకు చెందిన ముగ్గురిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
కాకాణిపై పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు
నెల్లూరు సిటీ: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకాణి కండీషన్ బెయిల్‌పై ఉన్నాడనే విషయం గుర్తు పెట్టుకోవాలని, ఆయన్ను వదిలిపెట్టేది లేదన్నారు. ఆస్తులను ఉదారంగా వదిలేసిన తాము శివాలయం భూమిని అమ్ముకుంటామా అని ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
డీసీసీ అధ్యక్షుడి మార్పు?
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడ్ని మార్చే అవకాశాలున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారంరోజుల నుంచి ఏఐసీసీ పరిశీలకుడు, తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే హసన్ మౌలానా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడిని మార్చాలని పలువురు ఆయన దృష్టికి తీసుకురావడం, కొందరు పదవి కోసం దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం తగిన మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10 సంవత్సరాలుగా డీసీసీ అధ్యక్షుడిగా చేవూరు దేవకుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆశించిన స్థాయిలో జిల్లాలో పార్టీ బలోపేతం కాకపోవడంతో మరో వ్యక్తిని నియమించే అవకాశముందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.
కండలేరులో
58.780 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 58.780 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 2,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


