ఆటో, మోటార్‌బైక్‌ల దొంగ అరెస్ట్
● రూ.5.20 లక్షల విలువైన
వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): రోడ్లపై పార్క్ చేసిన ఆటో, ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన మీర్జా జుల్ఫీకర్ అలీ గత నెల 22వ తేదీన తన ఆటోను నెల్లూరు పొగతోటలోని వెంకటరమణ హోటల్ వద్ద పార్క్ చేసి టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. తిరిగొచ్చిచూడగా వాహనం కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితుడు నెల్లూరు రూరల్ మండలం యలమవారిదిన్నెకు చెందిన పి.కల్యాణ్ కుమార్‌గా గుర్తించారు. బుధవారం నిందితుడు తన ఇంట్లో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దొంగతనం చేసిన ఆటోలో కల్యాణ్ పారిపోయేందుకు యత్నించగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. నెల్లూరు చిన్నబజారు, సంతపేట, తిరుపతి జిల్లా గూడూరు తదితర ప్రాంతాల్లో ఒక ఆటో, 11 మోటార్‌బైక్‌లను చోరీ చేసినట్లు అంగీకరించాడు. దొంగతనానికి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్యాణ్ వాచ్‌మెన్‌గా పనిచేసే సమయంలో వ్యసనాలకు బానిసయ్యాడని, నగదు కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్, ఎస్సై అబ్దుల్ రజాక్, క్రైమ్ పార్టీ సిబ్బంది జె.సురేష్ బాబు, ఎస్‌వీ శ్యామ్‌ప్రసాద్, ఎం.సుబ్బారావు, కె.వర్ధన్, షేక్ రియాజుద్దీన్, కె.దేవనాయుడు, ఎన్.దయాశంకర్, కె..విజయ్‌కుమార్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించి రివార్డులను ప్రకటించారు.


