లారీ ఢీకొని ట్యాంకర్ డ్రైవర్ మృతి
నెల్లూరు(క్రైమ్): మరమ్మతులకు గురైన పాల ట్యాంకర్‌ను పరిశీలిస్తున్న డ్రైవర్‌ను లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కనుపర్తిపాడు క్రాస్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన వి.సాంబశివరావు (64) పాల ట్యాంకర్ డ్రైవర్. అతను బుధవారం విజయవాడ నుంచి ట్యాంకర్‌తో చైన్నెకు బయలుదేరాడు. కనుపర్తిపాడు క్రాస్‌రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి ట్యాంకర్ బ్రేక్‌డౌన్ అయ్యింది. దీంతో డ్రైవర్ ట్యాంకర్‌ను ఆపి వెనుక వైపు పరిశీలిస్తుంగా కావలి నుంచి చైన్నె వైపు ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ వేగంగా అతడిని ఢీకొని డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో సాంబశివరావు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.


