పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి
● కలెక్టర్‌కు సీపీఎం నేతల వినతి
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు ఆర్టీడీ కాలనీలో గంజాయి ముఠా చేతిలో హత్యకు గురైన ప్రజానాట్య మండలి కళాకారుడు కె.పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీపీఎం నేతలు కోరారు. నాయకులు, పెంచలయ్య భార్య, ఇద్దరు కుమారులు బుధవారం కలెక్టర్‌ను ఆయన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాశయం కోసం పనిచేసిన పెంచలయ్య కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఆయన భార్య దుర్గకు ప్రభుత్వ ఉద్యోగం, కుమారుల చదువులకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. సాగు భూమి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.


