గర్భిణి ఆత్మహత్య
● అత్తింటి వేధింపులే కారణమని
బంధువుల ఆరోపణ
దుత్తలూరు: ఉరేసుకుని గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నందిపాడులో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉదయగిరి మండలం దేవలాలగడ్డకు చెందిన షేక్ కుబ్రా (18) చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. కొన్నేళ్లకు తండ్రి మృతిచెందాడు. దీంతో బంధువులు ఆమెను దుత్తలూరు మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీకిచ్చి గత ఆగస్టులో వివాహం చేశారు. కాగా యువతి ఇటీవల గర్భం దాల్చింది. దీంతో బంధువుల ఇంటికెళ్లి వస్తానని అత్తారింట్లో చెప్పింది. కాగా కుబ్రా బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అత్త రసూల్‌బీ ఇంటికొచ్చి చూసి కేకలు వేసింది. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు, తహసీల్దార్ యనమల నాగరాజు, ఎస్సై ఆదిలక్ష్మిలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా అత్తింటి వేధింపులతోనే కుబ్రా ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి పెద్దమ్మ గౌసియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.


