వామపక్షాల బంద్ ప్రశాంతం
● పెంచలయ్య హత్యకు నిరసనగా కదం
● గాంధీబొమ్మ సెంటర్‌లో డ్రగ్స్, గంజాయి దిష్టిబొమ్మల దహనం
● నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు
● సీపీఎం నగర కార్యదర్శి
కత్తి శ్రీనివాసులు అరెస్ట్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సీపీఎం నాయకుడు, ప్రజానాట్యమండలి కళాకారుడు పెంచలయ్య హత్యకు నిరసనగా వామపక్షాలు మంగళవారం చేపట్టిన జిల్లా బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాల విక్రయాలను నిషేధించాలనే డిమాండ్‌తో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజానాట్యమండలి, ఐద్వా తో పాటు ప్రజా సంఘాలకు చెందిన నాయకులు బంద్ చేపట్టారు. కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీల నాయకులు తమ మద్దతును ప్రకటించారు. బంద్‌కు సంఘీభావంగా జిల్లాలోని విద్యాసంస్థలు సెలవు ప్రకటించగా, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా మాసివేశారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, వామపక్ష కార్యకర్తల నడుమ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్జ్జి చేశారు. కత్తి శ్రీనివాసులును అరెస్ట్ చేసి వాహనంలో స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు గాంధీబొమ్మసెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని చెప్పిన రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పెంచలయ్య హత్య ఘటనపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి మాట్లాడుతూ జిల్లాలోని గంజాయి ముఠా సమాజానికి, పోలీసులకు సవాల్‌గా మారిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా పోలీసులు గంజాయి బ్యాచ్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ పెంచలయ్య గంజాయి బ్యాచ్ చేతిలో హత్యకు గురై మూడ్రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు సీఎం చంద్రబాబునాయడు, డీసీఎం పవన్‌కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉండడాన్ని చూస్తుంటే గంజాయి విక్రయాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ గంజాయి బ్యాచ్‌లను బలపరుస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జిల్లాలో గంజాయిని నిర్మూలించకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వామపక్షాల బంద్ ప్రశాంతం
వామపక్షాల బంద్ ప్రశాంతం


