మెడికోల ఆత్మహత్యల నివారణకు చర్యలు
నెల్లూరు(అర్బన్): రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో మెడికల్ విద్యార్థులు భవిష్యత్తులో ఆత్మహత్యలకు పాల్పడకుండా తగిన కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేయనున్నామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రఘునందన్ అన్నారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో రెండు నెలల కాలంలో ఇద్దరు మెడికోలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మంగళవారం ఆయన కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజన ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ట్రామాకేర్, చిన్నపిల్లల విభాగం, డెలివరీ వార్డు ఇలా పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మెడికల్ విద్యార్థులు, హెచ్‌ఓడీలు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవితో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ మాట్లాడుతూ వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్‌గౌర్, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఆదేశాలతో వైద్య కళాశాలలోని పరిస్థితులను పరిశీలించి విద్యార్థులకు అండగా ఉండేందుకు వచ్చామన్నారు. వైద్య విద్యార్థులకు ర్యాగింగ్, అకడమిక్, ఫ్యాకల్టీ, సొసైటీ పరంగా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. అయినప్పటికీ వ్యక్తిగత కారణాలతో కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరమన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ప్రతి 12 మంది విద్యార్థులను ఒక గ్రూపుగా విభజించి మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించి ఇన్‌చార్జులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నామని తెలిపారు. నాల్గో, ఐదో సంవత్సరాలకు సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నామన్నారు. వారు విద్యార్థులతో మమేకవుతూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. అలా చేసిన కృషిపై ప్రిన్సిపల్ ప్రతి మూడు నెలలకొకసారి తమకు నివేదిక అందించాల్సి ఉంటుందన్నారు.
సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలకు
రూ.80 కోట్లతో వైద్యపరికరాలు
సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలను అందించేందుకు పెద్దాస్పత్రిలో రూ.80 కోట్లతో అన్ని రకాల పరికరాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయని డీఎంఈ తెలిపారు. వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల పూర్తయిన క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయు)భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సీసీయూ భవనాలకు ఇప్పటికే 50 శాతం పరికరాలు వచ్చాయన్నారు. మిగిలిన వాటిని త్వరలోనే పంపిస్తామన్నారు. కాగా పలువురు డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం, కొందరు విధులకు డుమ్మాకొట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తుండడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ అలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని ఆదేశించారు. ప్రతిరోజూ రౌండ్స్ వేయాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. విధులకు డుమ్మా కొట్టే వారిని గురించి ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు డాక్టర్లు కళారాణి, సుశీల్, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, ఏడీ ఏడుకొండలు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు.
ప్రతి 12 మందికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పర్యవేక్షణ
సూపర్ స్పెషాలిటీ సేవలకు
రూ.80కోట్లతో వైద్యపరికరాలు
డీఏంఈ డాక్టర్ రఘునందన్


