అధికారమే అండ.. భూ కబ్జా కాండ
ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. స్థానికులు ప్రతిఘటించినా అధికార బలంతో లెక్క చేయడం లేదు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా రెడ్‌బుక్ భయంతో వారు భూ దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా ఉదయగిరి మండలం పప్పువారిపల్లిలోని రూ.2 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ టీడీపీ నేత బరితెగించి ఆక్రమించి జామాయిల్ సాగుకు యంత్రాలతో చదును చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.
40 ఎకరాలకు ఎసరు
ఆర్లపడియ పంచాయతీ పప్పులవారిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 47, 49, 53లలో 40 ఎకరాల ప్రభుత్వ అనాధీనం, పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిపై పక్క గ్రామానికి చెందిన టీడీపీ నేత కన్నేశాడు. గత పదిహేను రోజులుగా జేీసీబీ సాయంతో చెట్లను తొలగించి ట్రాక్టర్లతో చదును చేయిస్తున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా తొలుత పట్టించుకోలేదు. మరోసారి గ్రామస్తులు తహసీల్దార్ షాజియాకు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా పనులు నిలిపివేయించారు. కానీ భూ ఆక్రమణదారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం భూమిలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జామాయిల్ మొక్కలు నాటేందుకు ఆదివారం ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగడంతో తాత్కాలికంగా రెవెన్యూ అధికారులు పనులు నిలిపివేయించారు.అంతేతప్ప ఆక్రమణదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించలేదు. దీంతో రేపుమాపో గుట్టు చప్పడు కాకుండా రాత్రి వేళలో మొక్కలు నాటుతారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పప్పువారిపల్లిలో టీడీపీ నేత కబ్జా పర్వం
రూ.2 కోట్ల విలువ చేసే భూమికి ఎసరు
గ్రామస్తులు ప్రతిఘటిస్తున్నా
లెక్క చేయని వైనం
మౌనవ్రతంలో రెవెన్యూ అధికారులు
అధికారమే అండ.. భూ కబ్జా కాండ


