మతిస్థిమితం లేని మహిళ గృహనిర్బంధం
● ఖైదీలకు పెట్టినట్లుగా భోజనం అందజేత
● కొత్తకోడూరులో అమానుషం
తోటపల్లిగూడూరు: మతి స్థిమితం బాగా లేదని ఏడాదిగా ఓ మహిళను గృహనిర్బంధం చేసిన ఘటన మండలంలోని కొత్తకోడూరులో వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. కోడూరు పంచాయతీ కొత్తకోడూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల రత్నమ్మ మతిస్థిమితం సరిలేక ఇబ్బందులు పడుతోంది. అవివాహితురాలైన ఆమె వయస్సులో ఉన్నప్పుడు తోడబుట్టిన అక్కకు చేదోడు వాదోడుగా ఉండేది. ఈ క్రమంలోనే అక్క తన చెల్లి బాగోగులు చూసేది. కొద్ది కాలం తర్వాత అక్క చనిపోగా బావ, ఇతర బంధువులు మానసిక రోగి అయిన రత్నమ్మ బాగోగులను విస్మరించారు. వారందరూ నెల్లూరులో ఉంటూ ఆమెను కొత్తకోడూరులోని ఓ పురాతన ఇంట్లో నిర్బంధం చేశారు. మతిస్థిమితం లేదనే సాకుతో జనంలోకి రాకుండా అమానుషంగా గదిలో కట్టడి చేశారు. రత్నమ్మకు ప్రతి నెలా వచ్చే రూ.6 వేల పింఛన్, 35 కేజీల రేషన్ బియ్యాన్ని ఆమె బావ తీసుకొంటూ ఒక్క పూట మాత్రమే ఆమెకు భోజనం పెట్టేలా ఒకరిని నియమించాడు. అతను ఆ పూట భోజనం కూడా జైల్లో ఖైదీకి మాదిరిగా వరండాలోనే విసిరేసి వెళ్తుంటారు. భోజనంతో పాటు ఇతర కాలకృత్యాలన్నీ ఆ నాలుగు గోడల మధ్య కానించాల్సిన పరిస్థితి ఆమెది. ఒంటరిగా ఉన్న రత్నమ్మ రాత్రి పూట భయానికి ఏడస్తూ, పెద్ద పెద్దగా కేకలు వేస్తుండడంతో స్థానికులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఈ క్రమంలో స్థానికులు మంగళవారం మీడియా దృష్టికి తీసుకొచ్చారు. రత్నమ్మకు సంబంధించిన అన్నీ తీసుకొంటూ ఆమెను ఇలా ఓ పిచ్చిదానిలాగా ఒంటరిగా వదలి వేయడం అమానుషమన్నారు. మానవత్వంతో ఆలోచించి ఇంటికి తీసుకెళ్లడమా లేదా అనాఽథ ఆశ్రమంలో చేర్పించడమో చేయాలని ఆమె బావను కోరారు.


