తెలుగు తమ్ముళ్ల ఇష్టారాజ్యం
● కొత్తవంగల్లులో ఏకపక్షంగా పంపిణీ
● అధికారుల స్థానంలో టీడీపీ
నాయకులే పంచిన వైనం
కొడవలూరు: మండలంలోని కొత్తవంగల్లులో వ్యవసాయాధికారులు లేకుండానే టీడీపీ నాయకులు రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ ప్రక్రియ ఏకపక్షంగా జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి సోమవారం యూరియా లోడు వచ్చింది. సాధారణ రోజుల్లో అయితే నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటీ హాల్లో దించి ఆ తర్వాత రైతులకు పంపిణీ చేస్తారు. కానీ ఈసారి యూరియాను లారీలోనే ఉంచి హడావుడిగా పంపిణీ చేశారు. ఇదంతా నిబంధనల ప్రకారం జరిగిందా అంటే అదీ లేదు. గ్రామ వ్యవసాయ సహాయకుడి ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. వీఏఏ పింఛన్ల అందజేతకు వెళ్లారన్న సాకు చూపి స్థానిక టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు.
మళ్లీ ఇస్తామంటూ..
తమ పార్టీ వర్గీయులకే సమాచారాన్ని చేరవేసి వారికే పంపిణీ చేశారు. ప్రతిపక్ష పార్టీ వర్గానికి చెందిన వారు వెళ్లినా ప్రస్తుతానికి ఈ లోడు సరిపోదని, మళ్లీ వస్తే ఇస్తామంటూ తిప్పి పంపారు. వైఎస్సార్‌సీపీ చెందిన చక్కా రామయ్య అనే రైతుకు ఇదే అనుభవం ఎదురు కావడంతో వాగ్వాదానికి దిగారు. ఏ మాత్రం ఖాతరు చేయకపోవడంతో వ్యవసాయ శాఖ జేడీకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. వీఏఏ సమక్షంలోనే పంపిణీ జరగాలని, నాయకుల చేత చేయించడం నిబంధనలకు వ్యతిరేకమని జేడీ తెలిపారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
యూరియా మాకే.. మీకు లేదు


