యాక్టివ్ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
● నగరంలో రోడ్లపై నడిపించిన పోలీసులు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని యాక్టివ్ రౌడీషీటర్లను పోలీసులు రహదారులపై నడిపించారు. నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవిస్తామని వారిచే ప్రతిజ్ఞ చేయించారు. వరుస ఘటనలతో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో సోమవారం నగరంలోని చిన్నబజారు, వేదాయపాళెం, బాలాజీ నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 45 మంది యాక్టివ్ రౌడీషీటర్లకు పోలీసు అధికారులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ కూడలి వరకు ప్రధాన రహదారిపై నడిపించారు. నగర ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ గాంఽధీబొమ్మ వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లు, ట్రబుల్ మాంగర్స్ కదలికలపై నిఘా ఉంచామన్నారు. వారు పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే పీడీ యాక్ట్‌లు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


