నెల్లూరు(వీఆర్సీసెంటర్): సీపీఎం నాయకుడు, ప్రజా నాట్యమండలి కళాకారుడు పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరులోని 17, 53, 54 డివిజన్లతోపాటు ఇనమడుగు సెంటర్‌లో సోమవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ జరిగింది. పార్టీ కార్యాలయాల్లో పెంచలయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పెంచలయ్య చేసిన కృషి మరువలేనిదన్నారు. అతడిని ఆదర్శంగా తీసుకుని నగరంలో గంజాయిని నిషేధించేలా యువత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించనున్న జిల్లా బంద్‌లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కట్టా సతీష్, మూలం ప్రసాద్, గడ్డం శ్రీనివాసులురెడ్డి, కత్తి పద్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ మాగుంటకు ఘన నివాళి
నెల్లూరు(బారకాసు): ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి నగరంలోని పొగతోటలో ఉన్న ఎం1 థియేటర్‌లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డికి ఒంగోలు, నెల్లూరు జిల్లాలు రెండు కళ్లు లాంటివన్నారు. ఒంగోలు ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. నెల్లూరు నగరంలో మినీ బైపాస్ రోడ్డు ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రితో చర్చించి కృషి చేశారని గుర్తు చేశారు. నెల్లూరులో ఎన్నడూ లేని విధంగా హత్యలు, దోపిడీలు, గంజాయి విక్రయం సిగ్గుచేటని చెప్పారు. ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో నేతలు కొండ్రెడ్డి రంగారెడ్డి, స్వర్ణా వెంకయ్య, బాల సుధాకర్, ఏసు నాయుడు, రఘురామ్ ముదిరాజ్, మాగుంట మమతమ్మ, మాగుంట సుబ్బరామ్, వరిదిరెడ్డి రవీందర్‌రెడ్డి, వీఎంవీ సుబ్బారావు, ఎల్లా విజయభాస్కర్‌రెడ్డి, కె.విజయభాస్కర్‌రెడ్డి, ప్రమిదల శ్రీనివాసులు, పలువురు సుబ్బరామిరెడ్డి అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పెంచలయ్య హత్యకు నిరసనగా ర్యాలీ


