లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఉద్యోగభద్రత కల్పించాలి
నెల్లూరు(అర్బన్): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు రాష్ట్రంలో ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్లను రెన్యూవల్ చేయడంతోపాటు ఉద్యోగభద్రత కల్పించాలని ఏపీ లైసెన్స్‌డ్ సర్వేయర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో జరిగిన రాష్ట్ర ధర్నాకు సోమవారం నెల్లూరు నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు నడవడి ముత్యంగౌడ్ మాట్లాడుతూ 2003 సంవత్సరంలో ఈ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. అప్పటి నుంచి అన్ని మండలాల్లో వివిధ సర్వే పనులు చేస్తూ రైతులు, ప్రభుత్వానికి వారధిలా పని చేశామన్నారు. తర్వాత కాలంలో విలేజ్ సర్వేయర్లను నియమించారన్నారు. ఆదుకుంటామన్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో తమను సర్వేయర్లుగా, రిజిస్ట్రార్ ఆఫీసులు, మున్సిపాలిటీ కార్యాలయాల్లోనూ లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా నియమించాలని కోరారు. రాష్ట్ర స్థాయి అధికారులు కూడా తమ వద్ద లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. న్యాయం చేయాలన్నారు.


