భూ వివాదంతోనే ప్రసాద్‌నాయుడి హత్య
● నిందితుల అరెస్ట్
కావలి (అల్లూరు): జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాళెంలో సంచలనం సృష్టించిన టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్‌నాయుడి హత్య కేసులో ఆరుగురు నిందితులను కావలిలోని మద్దూరుపాడు హైవే అండర్‌పాస్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశారు. కావలిలోని డీఎస్పీ కార్యాలయంలో వివరాలను డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. గట్టుపల్లి చింతలపాళెంలో ఇద్దరి మధ్య జరిగిన భూ వివాదమే హత్యకు దారితీసిందన్నారు. గట్టుపల్లి చింతలపాళెంలో మామిడి తోటకు సంబంధించి గారపాటి సదాశివరావు, తలసిల వెంకటనరసింహరావు మధ్య కొన్నేళ్లుగా వివాదం జరుగుతోంది. సదాశివరావుకు ప్రసాద్‌నాయుడు స్థానికంగా మద్దతిచ్చి తనపై కేసులు పెట్టిస్తున్నారని వెంకటనరసింహరావు కక్ష పెంచుకున్నారు. ఆయన్ను అడ్డు తొలగించుకుంటే తనకు ఎదురుండదని, భూ సమస్య పరిష్కారమవుతుందనే నిర్ణయానికొచ్చారు. ఈ తరుణంలో ప్రసాద్‌నాయుడి హత్యకు వెంకటనరసింహరావు ప్లాన్ వేశారు. కృష్ణా జిల్లా పులిగడ్డకు చెందిన రౌడీషీటర్ కొక్కిలిగడ్డ వెంకట్రావును సంప్రదించి పథక రచన చేశారు. నిందితులకు రూ.లక్ష నగదు, ఎకరా పొలమిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంకట్రావు స్నేహితుడు, మరో రౌడీషీటర్ ద్వారా కృష్ణా, బాపట్ల జిల్లాలకు చెందిన పాత నేరస్తులు డానియెల్, ప్రవీణ్‌కుమార్, నర్సింగరాజుతో ప్రసాద్‌నాయుడ్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. గత రెండు నెలల్లో మూడు సార్లు రెక్కీ నిర్వహించి విఫలమయ్యారు. గత నెల 26న పక్కా ప్రణాళికతో తన కోళ్ల ఫారంలో ఒంటరిగా ఉన్న ప్రసాద్‌నాయుడ్ని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చి పరారయ్యారు. కేసును దర్యాప్తు చేసి నిందితులను నెల్లూరు సీసీఎస్ సీఐ సీతారామయ్య పట్టుకున్నారు. హత్య కేసులో నిందితులను నాలుగు రోజుల్లోనే అరెస్ట్ చేసిన పోలీసులను ఎస్పీ అజిత అభినందించారు.


