చంద్రబాబు మోసంపై ఆమరణ నిరాహార దీక్ష
● గూడూరును నెల్లూరులో కలపాలి
● మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి
ఇందుకూరుపేట: ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని, లేదంటే అదే గూడూరు పట్టణ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి హెచ్చరిచారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని కుడితిపాళెంలో శనివారం కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గూడూరును నెల్లూరులో కలుపుతానని చంద్రబాబు మాట్లాడిన మాటలను మీడియాకు వినిపించారు. ఇచ్చిన హామీని విస్మరించి, మాట తప్పారంటూ విమర్శించారు. మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కోసమే గూడూరు తిరిగి నెల్లూరులో కలపాలనే నిర్ణయాన్ని విస్మరించారన్నారు. ప్రజల ఆకాంక్షల కన్నా మీ సామాజిక వర్గ నేతలు ముఖ్యమా అని ప్రశ్నించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందేనన్నారు. అప్పట్లో కందుకూరును నెల్లూరుకు, గూడూరును తిరుపతికి మార్చారని గుర్తు చేశారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని తాను కూడా వైఎస్ జగన్ దృష్టికి చాలా సార్లు తీసుకెళ్లామన్నారు. కొంత మంది ఐఏఎస్ అధికారులు ఆ విషయాన్ని పక్కదారి పట్టించారన్నారు. గూడూరును నెల్లూరులో కలపకుంటే రాజకీయాలను విరమించుకొంటానని స్థానిక ఎమ్మెల్యే సునీల్ చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం ఏమిటని నిలదీశారు. తమ పార్టీ అధ్యక్షుడు కాకాణి, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీతో కలిసి మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొంటానన్నారు. చంద్రబాబు మెడలు వంచి సాధించేలా ప్రజలు, వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, డీఎల్‌డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్‌కుమార్, బుచ్చిరెడ్డిపాళెం పట్టణం, రూరల్ అధ్యక్షుడు షేక్ షాహుల్, చెర్లో సతీష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి, సీనియర్ నాయకులు కలువ బాలశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


