మహిళల తడాఖా చూపిస్తాం
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, అధికార పార్టీ నేతలు మహిళలను అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వానికి మా తడాఖా చూపిస్తామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత హెచ్చరించారు. నగరంలోని జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. కాకాణి పూజిత మాట్లా డుతూ రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వద్ద పనిచేస్తున్న అనధికార వ్యక్తిగత సలహాదారుడు సతీష్‌కుమార్ ఒంటరి మహిళను వేధించడం బాధాకరమన్నారు. కోవిడ్‌లో భర్తను కోల్పోయి, ఉద్యోగం కోసం వచ్చిన బాధిత మహిళను డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు, లైంగిక వేధింపులకు గురి చేయడం అధికార పార్టీ నేతల దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. సహాయం కోరి వస్తే రక్షకులే భక్షకులుగా వ్యవహరిస్తున్నారని, ఇంటి పరువు కోసం పాకులాడుతూ కొందరు మహిళలు మౌనంగా రోదిస్తున్నా, కొందరు మహిళలు బహిరంగంగా మొర పెట్టుకుంటున్నా, వారికి న్యాయం చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే మొక్కుబడిగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారన్నారు. జగనన్న పాలనలో మహిళలను గౌరవించి, పెద్ద పీట వేశారన్నారు. మహిళల సాధికారతకు ఆయన పాలనలో ప్రతి పథకాన్ని మహిళల పేరిట అందించి అభివృద్ధి వైపు నడిపారన్నారు. మహిళలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని, మహిళాభివృద్ధి, సంక్షేమం చూసిన మహిళలు, టీడీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అత్యాచారాలను చూసి ఆవేదన చెందుతున్నారన్నారు. మహిళల భద్రత కోసం దిశా యాప్ తీసుకొని వచ్చి, మహిళలకు ధైర్యాన్ని కల్పించిన వ్యక్తి జగనన్న అన్నారు. రాష్ట్రంలోని మహిళా శక్తి ఉద్యమిస్తే కూటమి ప్రభుత్వం తట్టుకోలేదన్నారు. మహిళలతో తప్పుగా ప్రవర్తించే వాళ్లు, ఎంతటి వారైనా తప్పించుకోలేరన్న భయాన్ని కల్పించాలన్నారు. చంద్రబాబు తక్షణమే స్పందించి, పటిష్టమైన చర్యలు చేపట్టి, మహిళలను వేధిస్తున్న కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోనల్–4 అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ, తోటపల్లి గూడూరు జెడ్పీటీసీ సభ్యులు ఎంబెటి శేషమ్మ, పొదలకూరు ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీ కళ్యాణి, దువ్వూరువారిపాళెం సర్పంచ్ కృష్ణవేణమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు లావణ్య, నెల్లూరు నగర మహిళా విభా గం అధ్యక్షురాలు ధనుజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


