పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకం
నెల్లూరు (లీగల్): ప్రజలకు చట్ట పరమైన సహాయంపై అవగాహన కల్పించడంలో పారా లీగల్ వలంటీర్ల (న్యాయ సేవా సహాయకులు) పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. శ్రీనివాస్ అన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవ సదన్‌లో శనివారం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంస్థలకు ముఖ్య వారధిగా ఉంటూ బాధ్యతతో మెలగాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే వాణి మాట్లాడుతూ ప్రతి వలంటీర్ బాధ్యతతో విధులు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కారించడంలో ముందు ఉండాలని తెలిపారు. వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప రెడ్డి, సీనియర్ న్యాయవాది గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
7న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
నెల్లూరు (టౌన్): 2025–26కు సంబంధించి జాతీయ ఉపకార వేతన పరీక్ష డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్నట్లు డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, 3685 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్‌సైట్ www. bse. ap. gov. in, వాట్సాప్– మన మిత్రలో అందుబాటులో ఉన్నాయన్నారు. హెచ్‌ఎంలు పాఠశాల యూడైస్ కోడ్‌ను ఉపయోగించి లాగిన్ అయి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలన్నారు.
13న జెడ్పీ
సర్వసభ్య సమావేశం
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం డిసెంబర్ 13వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ ఎల్. శ్రీధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ, నీటి పారుదల, వైద్య ఆరోగ్య శాఖ, సాంఘిక సంక్షేమం, ఆర్ అండ్ బీ, జెడ్పీ 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు తదితర శాఖలపై సమీక్ష సమావేశం జరుగుతుందన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.


