2న జిల్లా బంద్
● గంజాయి ముఠా హత్యాకాండకు నిరసనగా..
● రాష్ట్రంలో మితిమీరిన ఆగడాలు
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): నెల్లూరు రూరల్ నియోజకవర్గం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి ముఠా చేతిలో సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్యకు నిరసనగా డిసెంబరు 2న జిల్లా బంద్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన హుటాహుటినా నెల్లూరుకు చేరుకుని జీజీహెచ్‌లో ఉన్న పెంచలయ్య మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ గంజాయి ముఠా హత్యాకాండకు నిరసనగా చేపట్టే బంద్‌కు అన్ని పార్టీలు, ప్రజలు మద్దతు ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ బంద్ గంజాయి ముఠా మాఫియా అంతానికి నాంది కావాలని కోరారు. రాష్ట్రం, జిల్లాలో మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అధికారులు అరి కట్టలేకపోతున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే గంజాయి ముఠా ఆగడాలు సాగుతున్నాయని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ సైతం నిర్వీర్యమై పోయిందన్నారు. యువత గంజాయి తాగి విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గంజాయి ముఠా ఆగడాలను అరికట్టాలని, హత్యలను నిలువరించాలన్న ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, మాదాల వెంకటేశ్వర్లు, జిల్లా, నగర, రూరల్ నియోజకవర్గ సీపీఎం నేతలు పాల్గొన్నారు.


