ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
ఉలవపాడు: ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో మహిళ మృతి చెందగా, ఆరుగురు గాయపడిన ఘటన జాతీయ రహదారిపై రాజుపాళెం జంక్షన్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉలవపాడు మండలంలోని టెంకాయచెట్లపాళేనికి చెందిన కూలీలు రాజుపాళెం వద్ద జామాయిల్ చెట్ల ఆకులను మెషీన్లో వేసే పొట్టు పనికి బయల్దేరారు. ఈ క్రమంలో రాజుపాళెం జంక్షన్ సమీపంలోకి వచ్చేసరికి ఆటోను హైదరాబాద్ నుంచి చైన్నె వెళ్తున్న వీ కా వేరి ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొంది. ఘటన లో ఆటోలో ఉన్న లక్ష్మి (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయ్, పోలమ్మకు కాళ్లు విరగ్గా.. సురేష్, పద్మ, అంజమ్మ, సుజాత స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా ఉలవపాడు వైద్యశాలకు.. ఆపై మెరుగైన వైద్యం నిమిత్తం కావలిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృతదేహానికి ఉలవపాడు సీహెచ్‌సీలో పోస్ట్‌మార్టాన్ని నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటన స్థలాన్ని ఎస్సై అంకమ్మ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫెన్సింగ్ రాయే కారణమా..?
ఆటోను బస్సు ఢీకొన్న సమయంలో లక్ష్మి మృతికి ఫెన్సింగ్ రాయి సైతం కారణమని తెలుస్తోంది. బస్సు ఢీకొనడంతో ఫెన్సింగ్ వద్దకు ఆటో వచ్చేసింది. అందులో ఉన్న లక్ష్మి బయటపడిపోయి ఫెన్సింగ్ రాయికి తల కొట్టుకోవడంతో మృతి చెంది ఉండొచ్చని బంధువులు భావిస్తున్నారు.
ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు


