మహిళలపై గొడ్డలితో దాడి
ఉదయగిరి: ఇద్దరు మహిళలపై గొడ్డలితో వ్యక్తి దాడి చేసిన ఘటన మండలంలోని పుల్లాయపల్లి ఎస్సీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కట్టెల కోసం సమీపంలోని అడవికి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీనరసమ్మ, కవిత వెళ్లారు. ఈ క్రమంలో కవితకు వరుసకు బావ.. లక్ష్మీనరసమ్మ భర్తకు మరిదైన ఆదినారాయణ తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఆదినారాయణ తన వద్ద ఉన్న గొడ్డలితో వీరిపై దాడి చేశారు. కాగా వ్యసనాలకు బానిసై కాలనీలో చిన్న దొంగతనాలకు పాల్పడుతుండటంతో గతంలో వీరిద్దరూ మందలించారనే విషయాన్ని మనస్సులో పెట్టుకొని దాడికి పాల్పడ్డారని కాలనీ వాసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన మహిళలను ఉదయగిరి సీహెచ్‌సీకి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వైద్యశాలకు ఎస్సై ఇంద్రసేనారెడ్డి చేరుకొని దాడి ఘటనపై వివరాలను సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నారు.


