రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు ప్రారంభం
పొదలకూరు: ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ – 17 బాలబాలికల రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలను పొదలకూరు డీఎన్నార్ జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో శుక్రవారం డీఈఓ బాలాజీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా వందనం స్వీకరించి క్రీడా జ్యోతిని వెలిగించారు. డీఈఓ మాట్లాడుతూ జిల్లాకు నాలుగు రకాల రాష్ట్ర స్థాయి గేమ్స్‌ను కేటాయించడం జరిగిందన్నారు. 13 జిల్లాల నుంచి 26 టీంలు వచ్చాయన్నారు. పోటీలు నిర్వహించేందుకు రగ్బీ అసోసియేషన్ కృషి చేసినట్టు తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్‌బాబు, ఎంఈఓలు శోభనాద్రి, రేణుక, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రమే ష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులకు స్థానికంగా వసతి సదుపాయాలను కల్పించారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 57.930 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,900 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


