పొట్టకూటి కోసం వచ్చి..
● రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
జలదంకి(కలిగిరి): వారంత వలస కూలీలు. కుటుంబాలను పోషించేందుకు రాష్ట్రాలు దాటి వచ్చారు. కష్టపడి పనిచేస్తూ పొట్ట నింపుకొంటున్నారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకతను ప్రాణాలు విడిచాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన 21 మంది వలస కూలీలు వరినాట్లు వేసేందుకు వచ్చారు. గురువారం జలదంకి మండలంలో 9వ మైలు వద్ద పనికెళ్లారు. ఒక పొలంలో నాట్లు వేసి మరో పొలంలో వేసేందుకు జాతీయ రహదారి దాటుతున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రామ్‌రాయ్ (45) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో సహచర కూలీలు కన్నీరుమున్నీరుగా రోదించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారిని స్థానికులు, రైతులు ఓదార్చారు. సమాచారం అందుకున్న జలదంకి పోలీసులు కేసు నమోదు చేశారు.


