వినియోగదారులతో మమేకమవ్వాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సరఫరాపై వినియోగదారుల్లో నెలకొన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు గానూ అధికారులు, సిబ్బంది మమేకమయ్యేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం పేర్కొన్నారు. నగరంలోని విద్యుత్ భవన్‌లో గల తన చాంబర్‌లో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. నిరంతర విద్యుత్ సరఫరా, లో ఓల్టేజీ సమస్య, ఉద్యోగుల పనితీరెలా ఉందనే అంశాలపై వినియోగదారులకు ఎస్‌ఈ నుంచి జేఎల్‌ఎం స్థాయి వరకు ఫోన్ చేసి వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటున్నామని వివరించారు. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని వివరించారు. రూరల్ డెవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలూ విద్యుత్‌ను అందించేందుకు త్రీ ఫేజ్ లైన్లను ఏర్పాటు చేస్తున్న తరుణంలో సరఫరాకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పనులను జిల్లా సర్కిల్లో వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయనున్నామని వెల్లడించారు. ఈఈ (టెక్నికల్) శేషాద్రి బాలచంద్ర పాల్గొన్నారు.


