సరఫరాకు సర్కారు పంగనామం
దుక్కి చేస్తుంటే దుఃఖం వస్తోంది.
● స్టాక్ ఉందంటున్నా.. సీజన్
దాటిపోతున్నా.. ఎక్కడా ఇవ్వని వైనం
● ప్రైవేట్ సీడ్‌దుకాణాలకు
పరుగులు పెడుతున్న రైతులు
● విత్తన వ్యాపారులకు
మేలు చేకూర్చేందుకేనా?
● డిమాండ్ ఉన్న రకాల్లేవు
చంద్రబాబు సర్కారు వ్యవసాయానికి, వరికి ‘ఉరి’ వేస్తోందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. వరి ధాన్యం వల్ల డయాబెటిస్ రోగ గ్రస్తులు పెరుగుతున్నారంటూ వరి సాగు చేయొద్దనే రీతిలో నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పటికే ధరల స్థిరీకరణ నిధిని ఎత్తేశారు. అన్ని రకాల పంటల ధరలు పాతాళానికి పడిపోతున్నా.. కట్టడికి చర్యలు చేపట్టడం లేదు. రైతులు పండించిన పంటలను రోడ్ల మీద, కాలువల్లో పారబోస్తున్నా.. చలనం లేదు. ప్రకృతి విపత్తుల్లో అండగా ఆదుకునే ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. గతంలో ఆదుకున్న పెట్టుబడి సాయానికి కోతలు విధించారు. యూరియా సరఫరాపై చేతులెత్తేశారు. తాజాగా ‘వరి’ విత్తనాల సరఫరాకు పంగనామం పెట్టేశారు.
నెల్లూరు (పొగతోట): రబీ సీజన్‌లో నారుమడులు పోసుకునే అదను దాటిపోతున్నా.. అన్నదాతలను ప్రభుత్వ సరఫరా చేసే విత్తనం వరించలేదు. జిల్లాలో 38 మండలాల్లో 7.30 లక్షల ఎకరాల్లో వరి సాగుకు నీటి విడుదల చేయాలని ఇటీవల ఐఏబీ నిర్ణయించింది. చెరువులు, డెల్టా కాలువల కింద అనధికారికంగా సుమారు మరో 1.50 లక్షల ఎకరాల్లో కూడా సాగు జరుగుతోంది. సుమారుగా 9 లక్షల ఎకరాల్లో రబీ సీజన్‌లో ఏటా వరి సాగు జరుగుతోంది. ఈ ప్రకారం రైతులకు సుమారు 24,600 మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం కాగా జిల్లా వ్యవసాయశాఖ దగ్గర కేవలం 35.51 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంచడాన్ని బట్టి రైతులపై చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి ఎంతో విస్పష్టమవుతోంది. ఆది నుంచి రైతు వ్యతిరేకిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. ఆయన పాలనలో ఎప్పుడూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కిన చరిత్ర లేదు. విత్తనాలకు, ఎరువులకు వ్యవసాయశాఖ కార్యాలయాల ముందు బారులు తీరిన దృశ్యాలు కనిపించేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ స్థాయిలోనే ఆర్బీకే వ్యవస్థను సృష్టించి విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలిచారు.
సబ్సిడీ విత్తన సరఫరాకు పంగనామం
గత సార్వత్రిక ఎన్నిక తర్వాత టీడీపీ పాలనలో 2024–25 రబీ, 2025 ఖరీఫ్ పంట కాలాలు పూర్తిగా ప్రస్తుతం 2025–26 రబీ సీజన్ నడుస్తోంది. ఈ మూడు సీజన్లకు సంబంధించి రైతులకు విత్తనాలు సరఫరా చేయడంలో చేతులెత్తేసింది. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో రబీ సీజన్‌లోనే వరి పంట సాగవుతోంది. ఈ సమయంలో జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు కేఎన్‌ఎం 1638, బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, ఎంటీయూ 1010, కేఎన్‌ఎం 733 రకాల విత్తనాలు మొత్తం 35.51 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంచారు. కేవలం 35.51 మెట్రిక్ టన్నుల విత్తనాలు నిల్వలు ఉంచిందంటే వ్యవసాయంపై, రైతుల సంక్షేమంపై ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా, బాధ్యతగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. గతంలో ప్రభుత్వాలు కేజీకి రూ.5 సబ్సిడీతో వరి విత్తనాలను సరఫరా చేశాయి. ప్రస్తుతం సబ్సిడీతో విత్తనాలు సరఫరాకు పంగనామం పెట్టేసింది.
అవసరమైన విత్తనాలు24,400 మెట్రిక్ టన్నులు
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం: 7.30 లక్షల ఎకరాలు
జిల్లాలో వ్యవసాయశాఖ వద్ద అందుబాటులో ఉన్న విత్తనాలు:
35.51 మెట్రిక్ టన్నులు
అనధికార ఆయకట్టు కింద: 1.50 లక్షల ఎకరాలు
ఆర్బీకే వ్యవస్థతో ఊర్లోకే విత్తనాలు, ఎరువులు
గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ రైతు విత్తనాలకు, ఎరువులకు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రతి ఊరిలోనే ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. సీజన్ ప్రారంభానికి నెల ముందు నుంచే ఏ గ్రామంలో ఏ రైతుకు ఎన్ని విత్తనాలు, ఎంత ఎరువులు అవసరం అవుతాయో ఆ మేరకు సిద్ధంగా ఉంచారు. ప్రధానంగా ఏ ప్రాంతంలో ఏ రకం వరి సాగు చేస్తున్నారో ఆ రకాలను అవసరమైన మేరకు సిద్ధంగా ఉంచడమే కాకుండా, అవసరమైతే అప్పటికప్పుడు సరఫరా చేసేందుకు కూడా వ్యవస్థను సిద్ధంగా ఉంచారు. ప్రకృతి విపత్తులతో వరి నారుమడులు దెబ్బతింటే తిరిగి పోసుకునేందుకు పూర్తి సబ్సిడీతో కూడా విత్తనాలు సరఫరా చేసిన చరిత్ర వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ఆర్బీకే వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. గత ఖరీఫ్ సీజన్‌లో యూరియా కోసం రైతులు పడిన పాట్లు ఇందుకు అద్దం పడుతోంది.
గతంలో వ్యవసాయశాఖ నుంచి సబ్సిడీతో అందించిన వైనం
డిమాండ్ ఉన్న
విత్తనాల్లేవు..
రబీ సీజన్ ప్రారంభమై దాదాపు నెల అవుతోంది. వ్యవసాయశాఖ వద్ద సమృద్ధిగా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో జిల్లా వ్యవసాయశాఖాధికారులు సైతం తాము రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేస్తున్నామని కానీ, తమ వద్ద ఇంత స్టాక్ ఉందని కానీ ఎక్కడా ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవు. గతంలో ప్రతి మండలంలో ఏఓలు రైతులకు కేజీకి రూ.5 సబ్సిడీతో పలానా వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని ప్రచారం చేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా లేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అత్యధిక ధరలకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 95 శాతం మేర వరి నారు మడులు పోసుకున్నారు. మొత్తానికి విత్తనాలు ఇవ్వకుండానే వ్యవసాయశాఖ చేతులెత్తేస్తే.. ప్రభుత్వం ముఖం చాటేసింది. కాగా ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖాధికారిణి సత్యవాణిని సంప్రదించగా, రైతులకు అవసరమైన వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
సరఫరాకు సర్కారు పంగనామం


