నోబిడ్‌పై రైతుల ఆగ్రహం
● లోగ్రేడ్ పొగాకు కొనుగోలు
తిరస్కరణపై ఆరోపణలు
● ఒకటో వేలం కేంద్రంలో వేలాన్ని ఆపేసి నిరసన
● రైతులు, వ్యాపారులతో చర్చించి
కొనసాగించిన అధికారులు
కందుకూరు: లోగ్రేడ్ పొగాకును వేలం కేంద్రంలో కొనుగోలు చేయడం లేదంటూ కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రంలో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. పొన్నలూరు మండలం ముండ్లమూరివారిపాళెం క్లస్టర్‌కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలానికి తెచ్చారు. వీటిలో అధికంగా లోగ్రేడ్ పొగాకు బేళ్లు ఉన్నాయి. అయితే వేలం ప్రారంభమైన తర్వాత లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకుండా వ్యాపారులు తిరస్కరించడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలం చివరికి చేరిందని, ఇప్పుడు కూడా లోగ్రేడ్ ఉత్పత్తులు కొనుగోలు చేయకపోతే ఈ పొగాకును ఏం చేయాలంటూ నిలదీశారు. వేలాన్ని నిలిపి వేసి వేలం కేంద్రం బయట నిరసనకు దిగారు. పొగాకు బేళ్లను దహనం చేసే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన వేలం నిర్వహణాధికారి శివకుమార్ రైతులు, వ్యాపారులతో చర్చించారు. రైతుల వద్ద ఉన్న లోగ్రేడ్ పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు. దీనికి వ్యాపారులు సమ్మతించడంతో అత్యంత తక్కువ ధర కేజీ రూ. 50 చొప్పున పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. అప్పటికే వందల బేళ్లను తిరస్కరించడంతో రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
రైతులకు నోబిడ్.. దళారులకు ఒకే
వేలం కేంద్రంలో లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేసే విషయంలో వ్యాపారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపించారు. వేలం ప్రక్రియ చివరి దశకు చేరడంతో రైతులు అధికంగా లోగ్రేడ్ పొగాకునే వేలం కేంద్రానికి తెస్తున్నారు. అయితే వేలంలో పెడితే కొనుగోలుకు వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. ఆ బేళ్లను రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో ఎంత వస్తే అంత రేటుకు విక్రయిస్తున్నారు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారులు వేలం కేంద్రం వద్దే మాటు వేసి తిరస్కరించిన బేళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇదే పొగాకును రూ.700 నుంచి 1000 వరకు కొనుగోలు చేస్తుండడం గమనార్హం. దళారులు ముందుగానే వేలం ప్రక్రియలో పాల్గొనే కంపెనీల ప్రతినిధులతో కొంత కమీషన్ ఇచ్చే విధంగా బేరం కుదుర్చుకుని వేలంలో బేళ్లు ఉంచుతున్నారు. రైతులు ఉన్నప్పుడు తిరస్కరించిన బేళ్లనే తిరిగి దళారులు వేలంలో పెడితే మాత్రం క్వింటా పొగాకును రూ.5 వేలకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల ప్రతినిధుల తమ స్వలాభం కోసం అవినీతికి పాల్పడుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
నోబిడ్‌పై రైతుల ఆగ్రహం


