సర్వేపల్లిలో అంతులేని అవినీతి
● వైఎస్సార్‌సీపీ హయాంలోనే అభివృద్ధి
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ముత్తుకూరు (పొదలకూరు): సర్వేపల్లి నియోజకవర్గంలో అంతులేని అవినీతి రాజ్యమేలుతోందని, అభివృద్ధి గాలికి వదిలేసి సంపాదనే ధ్యేయంగా అక్రమాలు కొనసాగుతున్నాయని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి అంటూ జరిగిందంటే అది వైఎస్సార్‌సీపీ హయాంలోనే అన్నారు. మండలంలోని తాళ్లపూడి పంచాయతీ కప్పలదొరువులో బుధవారం కాకాణి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో గ్రా మాల్లో సంపూర్ణంగా సీసీరోడ్లు, సైడ్ డ్రెయిన్లను నిర్మించామన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మత్స్యకారేత ప్యాకేజీని అన్ని గ్రామాలకు అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో అందజేశామన్నారు. ఏపీ జెన్‌కో 3వ యూనిట్ ప్రారంభోత్సవానికి జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేసిన సందర్భంగా 200 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం సర్వేపల్లిలో అవినీతి వరద పారుతున్నట్టు విమర్శించారు. ఏపీ జెన్‌కోలో బూడిదను అక్రమంగా తరలిస్తూ ప్రతి నెల రూ.లక్షలు దోచుకుంటున్నారని, టీడీపీ నాయకులు జెన్‌కో కార్యాలయంపై దాడికి పాల్పడడమే ఇందుకు నిదర్శనమన్నారు. పామాయిల్ యూనియన్ పేరుతో స్థానిక ట్యాంకర్ల యజమానుల అవసరాలను పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారం దోచుకుంటున్నట్లు ఆరోపించారు.
ఫిషింగ్ జెట్టి పనులపై పోరాటం
మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడే ఫిషింగ్ జెట్టి పనులను నిలిపివేసి వారికి సోమిరెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని కాకాణి విమర్శించారు. జెట్టి పనులు ప్రారంభించకుంటే మత్స్యకారులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలతో జనాలు బాగా విసిగి వేసారిపోయారని జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రామంలో పార్టీ నాయకుడు శ్రీనివాసులురెడ్డి కుమారుడి వివాహానికి కాకాణి హాజరయ్యారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు.


