ప్రైవేట్ పార్శిల్ సర్వీస్‌లో తనిఖీలు
● బిల్లుల్లేని రూ.20 లక్షల విలువైన సిగరెట్లు, పాన్ మసాలాలు స్వాధీనం
నెల్లూరు (క్రైమ్): ఓ ప్రైవేట్ పార్శిల్ సర్వీసులో బిల్లులు లేకుండా అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.20 లక్షలు విలువ చేసే సిగరెట్లు, పాన్ మసాలాలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం బుధవారం స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ వివిధ రాష్ట్రాల నుంచి సిగరెట్లు, పాన్‌మసాలాలు దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరు వెంకటరామపురంలోని బీఎంపీఎస్ పార్శిల్ సర్వీస్‌లో పెద్ద ఎత్తున సిగిరెట్లు, పాన్‌మసాలాలు అక్రమ రవాణా అవుతున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు బుధవారం పక్కా సమాచారం అందింది. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ కె. నరసింహరావు, డీసీటీఓ కె. విష్ణురావు, డీసీటీఓ(జీఎస్టీ)ఎన్‌వీ సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి పార్శిల్ సర్వీస్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు చేశారు. కార్యాలయంలోని 27 బాక్స్‌లను తనిఖీ చేయగా అందులో 24 బాక్సుల్లో సిగరెట్లు, మూడు బాక్స్‌ల్లో పాన్‌మసాలా ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అవి ఎవరు? ఎక్కడికి? ఎవరి పేరుపై బుక్ చేశారనే వివరాలపై అధికారులు ట్రాన్స్‌పోర్టు కార్యాలయ సిబ్బందిని ఆరా తీశారు. వారు తమ వద్ద ఫోన్ నంబరు మాత్రమే ఉందని ఇతర వివరాలు ఏమిలేవని చెప్పారు. పట్టుబడినవి నకిలీవా? అసలైనావా అని గుర్తించేందుకు శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నారు. ఫోన్‌నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చైన్నె నుంచి నర్సారావుపేటకు గుర్తు తెలియని వ్యక్తి బుక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. పార్శిల్ కార్యాలయంలో ఏదైనా వస్తువు పార్శిల్ చేసే సమయంలో అక్కడి సిబ్బంది ఎవరు? ఎవరికి? ఎక్కడికి పంపుతున్నారు.. వారి చిరునామా, ఫోన్ నంబర్లను సేకరించిన తర్వాతే బుకింగ్ చేసుకుంటారు. అవేమి లేకుండా కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా పాన్‌మసాలాలు, సిగరెట్లు తరలింపుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్శిల్ రవాణా సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందానే అనుమానాలు ఉండడంతో అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు.


