● రోజు వ్యవధిలో
మృతిచెందిన దంపతులు
● గ్రామంలో విషాదం
ఆత్మకూరు: వారి వివాహమై దశాబ్దాలు గడిచాయి. ఎంతో అన్యోన్యంగా జీవించారు. మరణం వారి బంధాన్ని విడదీయలేదు. రోజు వ్యవధిలో భార్యాభర్త తనువు చాలించారు. స్థానికుల కథనం మేరకు.. ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారం గ్రామానికి చెందిన నరాల వెంగయ్య (95), వెంకటమ్మ (90) దంపతులకు ముగ్గురు సంతానం. 70 ఏళ్ల క్రితం వివాహంతో ఒక్కటైన వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఎంతో అన్యోన్యంగా జీవించారు. గ్రామంలో పలువురికి సహాయంగా ఉంటూ వ్యవసాయ పనులు చేసుకునేవారు. కొద్దిరోజుల క్రితం వెంగయ్య అనారోగ్యానికి గురయ్యాడు. వెంకటమ్మ పలుమార్లు చేజర్లలోని ఆస్పత్రికి భర్తను తీసుకెళ్లి చూపించుకొని వచ్చేది. ఆదివారం అర్ధరాత్రి ఆయన మృతిచెందాడు. అంత్యక్రియలు సోమ వారం సాయంత్రం నిర్వహించారు. దశాబ్దాలకుపైగా తోడుగా ఉన్న భర్త మృతిచెందడంతో వెంకటమ్మ తీరని బాధతో మంగళవారం తెల్లవారుజామున చనిపోయినట్లు బంధువులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
మరణంలోనూ వీడని అనుబంధం
మరణంలోనూ వీడని అనుబంధం


