యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు
● జగనన్న లేఅవుట్‌లో బేస్‌మెంట్‌ల మధ్య తోలింది అపహరణ
● విద్యుత్ స్తంభాల చుట్టూ ఉన్నది కూడా..
● పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న ఏఈ
పొదలకూరు: కొండలు, గుట్టలను కరిగించి గ్రావెల్, మట్టిని తరలిస్తున్న అక్రమార్కుల కన్ను ఇప్పుడు గత ప్రభుత్వంలో నిర్మించిన జగనన్న లేఅవుట్‌పై పడింది. లేఅవుట్‌ను చదును చేసేందుకు తోలిన గ్రావెల్‌ను రాత్రి వేళల్లో తరలించి అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వందల ట్రిప్పులు తరలినట్లు హౌసింగ్ అధికారులు గుర్తించారు.
పొదలకూరు పట్టణానికి సమీపంలో చిట్టేపల్లి తిప్ప వద్ద 1,400 ప్లాట్లతో అతిపెద్ద లేఅవుట్‌ను నిర్మించారు. ఇందుకోసం కొండ కింద చదును చేసేందుకు గ్రావెల్‌ను పెద్ద ఎత్తున తోలారు. ప్రస్తుతం లేఅవుట్‌పై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. కాగా ఇందులో 400 పక్కా ఇళ్లను కూడా నిర్మించారు. వివిధ దశల్లో ఉండగా కొన్ని శ్లాబులు కూడా వేశారు. ఇళ్ల బేస్‌మెంట్‌ను నింపేందుకు గ్రావెల్‌ను తోలారు. లేఅవుట్ కొండకు సమీపంలో చాలాకాలంగా గ్రావెల్‌ను కొల్లకొడుతున్నారు. ఇప్పుడు శ్రమ లేకుండా లేఅవుట్ గ్రావెల్‌నే అపహరించుకెళ్తున్నారు.
రాత్రి వేళల్లోనే తరలింపు
పగటి పూట తరలిస్తే గుర్తిస్తారని గ్రావెల్‌ను రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. దీంతో గోతులు ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు. లేఅవుట్‌లో విద్యుత్ సౌకర్యం కోసం స్తంభాలు నాటి తీగలను కూడా ఏర్పాటు చేశారు. అక్రమార్కులు స్తంభాల చుట్టూ ఉన్న గ్రావెల్‌ను కూడా వదిలి పెట్టకుండా తరలిస్తున్నారు. హౌసింగ్ అధికారులు ఒకటి, రెండు పర్యాయాలు మీడియా ముఖంగా హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. చుట్టుపక్కల నివాసాలున్న కాలనీవారు సైతం అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తున్నారు. విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. రాత్రి వేళల్లో నిఘా ఏర్పాటు చేస్తే ఎవరు తరలిస్తున్నారో గుర్తించవచ్చని చెబుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
లేఅవుట్‌లో గ్రావెల్ అపహరించుకుని వెళ్తున్న మాట వాస్తమే. ఎవరు తరలిస్తున్నారో గుర్తించలేకపోతున్నాం. ఇటీవల తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఆదేశాల మేరకు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. రాత్రివేళ నిఘా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం.
– మహేష్, హౌసింగ్ ఏఈ, పొదలకూరు
యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు
యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు


