అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్
● రూ 21.90 లక్షల రికవరీ
నెల్లూరు(క్రైమ్): అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి నగదు రికవరీతోపాటు ఖాతాలోని నగదును పోలీస్ అధికారులు ఫ్రీజ్ చేశారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అజిత అధికారులను అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. కావలి పట్టణంలోని ఓ వ్యక్తికి ఆర్టీఓ చలానా పేరుతో ఏపీకే ఫైల్ పంపించి అతని ఖాతాలోని సుమారు రూ.24 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కావలి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితులను జార్ఖండ్ రాష్ట్రం జమ్మారా జిల్లాకు చెందిన వివేక్‌కుమార్ మండల్, రాకేష్‌కుమార్ మండల్, సంజయ్ మండల్‌గా గుర్తించారు. ప్రత్యేక బృందం ఈనెల 14వ తేదీన ఆ రాష్ట్రంలో నిందితులను అరెస్ట్ చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై కావలికి తీసుకొచ్చారు. 18వ తేదీన కావలి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. పోలీసులు కావలి సబ్ జైలులో ఉన్న నిందితులను కోర్టు అనుమతితో ఈనెల 20వ తేదీన కస్టడీకి తీసుకున్నారు. విచారించి రూ.21.90 లక్షల నగదు, సెల్‌ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా బ్యాంక్ ఖాతాల్లోని రూ.1,23,855లను ఫ్రీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. సోమవారం కస్టడీ ముగియడంతో కోర్టులో నిందితులను హాజరుపరిచి జైలుకు తరలించారు. కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన కావలి ఒకటో పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎండీ ఫిరోజ్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎ.వెంకటేశ్వర్లు, కావలి ఎస్సై ఎస్.సుమన్, సిబ్బంది పి.శ్రీనివాసులురెడ్డి, రవీంద్ర, కావలి సిబ్బంది వి.మధుసూదన్, శ్రీరామ్, శ్రీహరి, శివకుమార్‌ను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్


