వినతులిచ్చి.. పరిష్కారం కోరి
● జేసీ మొగిలి వెంకటేశ్వర్లు
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. దీనికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. వినతులిచ్చి పరిష్కరించాలని కోరారు. డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీఆర్ డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ గంగా భవాని, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు రఘురామరాజు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
విచారణ జరపాలని వినతి
మర్రిపాడు మండలం జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థిని బలవన్మరణంపై, అదే విధంగా ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలంటూ ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల సంఘం నాయకులు జేసీకి వినతిపత్రం సమర్పించారు. విద్యాలయంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని తొలగించేందుకు కలెక్టర్ చైర్మన్ హోదాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘానికి చెందిన ఉడతా రాజశేఖర్ యాదవ్, దాసరి కమలాకర్, ఆదిత్యసాయి, పి.లీలామోహన్, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వినతులిలా..
● కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానమైన బీసీల కుల వర్గీకరణ చట్టబద్ధంగా జరపాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరి రావు వినతిపత్రం అందజేశారు.
● పొదలకూరులో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని రామ్‌నగర్ వాసులు అర్జీ ఇచ్చారు.
● నెల్లూరులోని తడికలబజార్ సమీపంలో రైస్‌మిల్లు కారణంగా విడుదలవుతున్న పొట్టుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తగిన చర్యలు చేపట్టాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ వినతిపత్రం ఇచ్చారు.
పింఛన్ కోసం..
పింఛన్ కోసం షేక్ మౌలాలీ అనే వ్యక్తి అధికారులకు వినతిపత్రమిచ్చాడు. ఈయనకు రెండు చేతులకు వేళ్లు లేవు, నడవలేడు. రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కోరాడు. సదరం క్యాంపులో ఆధార్ నమోదులో వేళ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసినట్లు చెప్పారు. తనకు ఇద్దరు కుమారులున్నారని, కుటుంబ పోషణ కోసం కష్టంగా ఉందన్నారు.
వినతులిచ్చి.. పరిష్కారం కోరి


