వైఎస్సార్‌సీపీ మద్దతుతో.. | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మద్దతుతో..

Jul 20 2025 5:33 AM | Updated on Jul 20 2025 2:25 PM

వైఎస్

వైఎస్సార్‌సీపీ మద్దతుతో..

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కరేడు రైతు ఉద్యమాన్ని విభజించి నిర్వీర్యం చేసి, ఆ తర్వాత భూములు కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. మూడు పంటలు పండే పచ్చని భూములను కాజేసి ‘అమరావతి’ తరహాలో భూ వ్యాపార వ్యూహంతో ప్రభుత్వ పెద్దలు కుతంత్రాలకు తెర తీస్తున్నారు. పార్టీలకు అతీతంగా భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామాలకే గ్రామాలే ఏకమయ్యాయి. కరేడు రైతులు చేపట్టిన ఉద్యమం రాష్ట్ర స్థాయికి చేరడంతో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కీలకంగా ఉండే మత్స్యకారులను తప్పించేందుకు పన్నాగం పన్నింది.

కరేడు భూములు

కొట్టేసే పన్నాగం

ఇండోసోల్‌ కంపెనీకి

8,348 ఎకరాలివ్వనున్నట్లు జీఓ

4,900 ఎకరాల సేకరణకే నోటిఫికేషన్‌

అనధికారికంగా 20 వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వ పెద్దల ఆదేశాలు

ఉద్యమం నుంచి మత్స్యకారులను తప్పించేలా వ్యూహం

మరో నోటిఫికేషన్‌ లేదంటూ

ఎమ్మెల్యే బూటకపు ప్రకటనలు

వైఎస్సార్‌సీపీ మద్దతివ్వడంతో ప్రభుత్వం కుతంత్రాలు

ఉలవపాడు: కరేడు రైతులతో కూటమి ప్రభుత్వ పెద్దలు దాడుగుడుమూతల ఆటాడుతున్నారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో అవసరానికి మించి భూములు సేకరించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనే పన్నాగంతో ముందుకెళ్తున్నారు. ప్రాణాధారం, జీవనాధారమైన పచ్చని భూములను పరిశ్రమలకు ఇచ్చేందుకు సిద్ధంగా లేని కరేడు ప్రాంతం రైతులు పార్టీలకతీతంగా ఉద్యమిస్తున్న తరుణంలో బలవంతపు భూసేకరణ సాధ్యం కాదని అర్థమై అడ్డదారులు తొక్కుతున్నారు. ఉద్యమం నుంచి పార్టీలు, ప్రాంతాలను విభజించి నిర్వీర్యం చేసే కుట్రలకు పదను పెడుతున్నారు.

రాష్ట్రాన్ని తాకిన కరేడు రైతుల ఉద్యమం

ఇండోసోల్‌ కంపెనీకి అవసరమైన భూములను గత ప్రభుత్వ హయాంలోనే సేకరించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూములను కాదని కరేడు ప్రాంతంలో 8,348 ఎకరాలు ఇస్తున్నట్లు మార్చిలో జీఓ ప్రకటించింది. తొలివిడతలో 4,900 ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, తర్వాత మిగిలిన గ్రామాల్లో 3,500 ఎకరాల భూములు సేకరణకు నోటిఫికేషన్‌ కూడా అధికారులు సిద్ధం చేశారు. దీంతో గత నెల 29న రైతులు పార్టీలకతీతంగా జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం రైతులు, రైతు నాయకులను పోలీసులతో ముందుస్తు అరెస్ట్‌లు చేయించింది. కేసులు బనాయిస్తామని రైతులను హెచ్చరించింది. అయితే ఆంక్షలను ఎదిరించి రైతులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయికి చేరుకుంది.

మత్స్యకారులకు మాయమాటలు

ఈ ఉద్యమానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలియజేయడంతో కూటమి ప్రభుత్వం ఏం చేయాలో అర్థంగాని పరిస్థితుల్లో గ్రామసభ నిర్వహించింది. గ్రామసభలో రైతులు భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఈ ఉద్యమంలో అలగాయపాళెం, బట్టిసోమయ్యపాళెం, టెంకాయచెట్లపాళెం, పల్లెపాళెం, కరేడు గ్రామాల్లోని మత్స్యకారులది కీలక పాత్ర. రాస్తారోకోలో, గ్రామసభలో వ్యతిరేకించడంలో ముందున్న మత్స్యకారులను ఉద్యమం నుంచి విడదీస్తే నీరుగారిపోతుంది. తొలివిడత నోటిఫికేషన్‌లో ఈ మత్స్యకార గ్రామాల భూములు లేవు. రెండో విడతకు సిద్ధం చేసిన నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు టెంకాయచెట్లపాళెంలో పర్యటించి మత్స్యకార గ్రామాల భూములు ఎక్కడికి పోవని, ఉద్యమానికి దూరంగా ఉండాలని చెప్పడంతోపాటు అధికార పార్టీలో ఉన్న నాయకులను ఉద్యమం వైపు వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మత్స్యకారులను తప్పించి ముందు నోటిఫికేషన్‌లో ఉన్న భూముల సేకరణ చేస్తే తర్వాత ఈ గ్రామాల నోటిఫికేషన్‌ను జారీ చేయొచ్చనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని రైతులే అంటున్నారు.

రైతులతో దాగుడు మూతలు

భూసేకరణపై అధికారులు, ప్రజాప్రతినిధులు తలోరకంగా ప్రకటనలు చేస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారు. తొలుత 8,348 ఎకరాలు సేకరిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా 4,900 ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. కలెక్టర్‌ ఆనంద్‌ ప్రస్తుతానికి ఈ 4,900 ఎకరాలు మాత్రమే సేకరణ చేస్తామంటున్నారు. గడువు చెప్పడం లేదు. ఇదిలా ఉంటే 20 వేల ఎకరాలు సేకరించడానికి అధికారుల బృందాన్ని నియమించారు. ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో మిగిలిన 11,500 ఎకరాలు సేకరించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో సముద్ర తీరం నుంచి హైవే వరకు భూములు తీసుకునే యత్నం సాగుతుందని సమాచారం. కానీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి మత్స్యకార గ్రామాలు లేవని ఎమ్మెల్యే ఇంటూరి, కలెక్టర్‌ ఆనంద్‌ చెబుతున్నారు.

కరేడు ప్రాంత రైతుల ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించడంతో కూటమి ప్రభుత్వానికి గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించాక.. ఉద్యమాన్ని నీరుగార్చే కొత్త కుట్రలకు తెర లేపింది. పార్టీలకతీతంగా జరిగిన రాస్తారోకోలో సైతం 39 మందిపై కేసులు నమోదైతే 85 శాతం మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే ఉండడం విశేషం. వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుకూరు వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌లు పర్యటించి అండగా నిలవడంతో కరేడు రైతు ఉద్యమాన్ని చీల్చడానికి కూటమి నాయకులు కుట్ర ప్రారంభించారు. రైతుల జేఏసీకి తెలియకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఎందుకు కలిశారంటూ కరేడులో కూటమి నాయకులు రైతుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ప్రారంభించారు.

వైఎస్సార్‌సీపీ మద్దతుతో.. 
1
1/1

వైఎస్సార్‌సీపీ మద్దతుతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement