
ఎన్‌జీటీ ఆదేశాలు అమలు చేయండి
నెల్లూరు (అర్బన్): నగరంలోని మైపాడుగేటు సెంటర్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో జాఫర్ సాహెబ్ కెనాల్‌లో జల కాలుష్యాన్ని నివారించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆ పార్టీ స్థానిక నాయకులతో కలిసి శనివారం రాత్రి కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం ఇచ్చారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను అందజేశారు. అనంతరం కలెక్టర్‌తో చర్చిస్తూ ఎన్‌జీటీ నిబంధనలు పాటించకపోతే 43 వేల ఎకరాలకు నీరందిస్తున్న జాఫర్‌సాహెబ్ కాలువ పూడి పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. నీటి కాలుష్యం జరుగుతుందన్నారు. ఇలాంటి నష్టం జరిగే ప్రాజెక్ట్ అనాలోచిత నిర్ణయమన్నారు. అయితే స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ ద్వారా పేద ప్రజలకు షాపులు కేటాయించేందుకు తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రజా ఇబ్బందులు, రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ పక్షాన పోరాటం చేస్తామన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆ ప్రాంతంలో 100 అడుగుల రోడ్డు, కాలువ రివిట్‌మెంట్ వాల్ పూర్తి చేసి వాకింగ్ ట్రాక్, బ్యూటిఫికేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వాటన్నింటిని మరుగున పడేసిందని విమర్శించారు. స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ ద్వారా రహదారులు మళ్లీ ఆ క్రమణలు జరుగుతాయని, ట్రాఫి క్ విపరీతంగా పెరిగిపోతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 200 షాపులు ఒకే చోట ఏర్పాటు చేస్తే మొత్తం డ్రైనేజీ జాఫర్‌సాహెబ్ కెనాల్ పూడిపోయి వర్షాల్లో సమీపంలోని ఇళ్లు మునిగిపోతాయన్నారు. రైతుల పంటలకు నీరందదన్నారు. ఈ ప్రాజె క్టు నూటికి నూరు శాతం ఫెయిల్యూర్ అవుతుందని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి, కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలకృష్ణారెడ్డి, యువ జన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్, సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ ప్రభాకర్, 4, 5, 11వ డివిజన్ ఇన్‌చార్జిలు సంధాని, సుబ్బారెడ్డి, మహేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
స్ట్రీట్ వెండింగ్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్
కలెక్టర్‌కు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
వినతిపత్రం అందజేత