
24/7 మద్యం, గంజాయి
జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. నేరాల రికార్డులు ఆందోళన కలిగిస్తోంది. మద్యం, గంజాయి మత్తులో యువత విచక్షణ కోల్పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డబ్బుల్లేకపోతే దారిలో ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరించి, దోచే ఘటనలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఫోన్‌పే, గూగుల్‌పే వాలెట్ల నుంచి కూడా డబ్బులు లాక్కుంటున్నారు. క్వార్టర్ మందు కొట్టిస్తే.. ఖూనీలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. రాజకీయ నేతల ప్రోత్సాహంతో నేరస్తులు రెచ్చిపోతున్నారు. మత్తుతో పెరుగుతున్న నేరాలను అరికట్టాల్సిన పోలీస్ విభాగం మొక్కుబడి చర్యలకు పరిమితమవుతోంది.
జిల్లాలో
శాంతి భద్రతలకు ముప్పు
● నియంత్రణ తప్పిన మద్యం,
గంజాయి విక్రయాలు
● మత్తులో బెదిరింపులు, దోపిడీలు, హత్యల దృష్టాంతాలు
● రాజకీయ మద్దతుతో పేట్రేగుతున్న నేరస్తులు
● ప్రజలు భయంతో రాత్రి బయటకు
రావడానికే వెనుకాడుతున్న పరిస్థితి
● పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
● అభద్రతలో ప్రజాస్వామ్యం
సాక్షిప్రతినిధి, నెల్లూరు: ఖాకీలకు శాంతి భద్రతల కంటే.. అధికార పార్టీ నేతల ఆదేశాలే ప్రామాణికాలుగా మారాయి. రెడ్‌బుక్ రాజ్యాంగమే గీటురాయిగా మారింది. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు అడ్డగోలుగా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న గొంతుకుల అణిచివేతకు పాల్పడుతున్నారు. అదే ప్రతిపక్ష సభ్యులపై అధికార పార్టీ నేతలు, వారి కిరాయి రౌడీమూకలు సాగించే దాష్టీకాలపై మాత్రం నోరుమెదపడం లేదు. ‘శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. పగటి, రాత్రి గస్తీని పెంచడంతో పాటు డ్రోన్‌ల ద్వారా నేరస్తులు, చీకటి కార్యకలాపాలను, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను కట్టడి చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు’. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అభద్రతాభావం ప్రజల్లో నెలకొంటోంది. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి.
పోలీస్‌శాఖలో రాజకీయ పెత్తనం
కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసుశాఖలో రాజకీయ ప్రమేయం అధికమైంది. నేతలను ప్రసన్నం చేసుకున్న వారికే దాదాపు పోస్టింగ్‌లు దక్కాయి. దీంతో వారు చెప్పిందే వేదంగా పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోందన్న విమర్శలున్నాయి. కొందరు అధికారులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుపై కనబరుస్తున్న శ్రద్ధ శాంతిభద్రతల పరిరక్షణలో చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు నిఘా అంతంత మాత్రంగా మారడం నేరస్తులకు కలిసి వస్తోంది. దీంతో వారు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక విభేదాలు, పాతకక్షలు, చిన్నపాటి కారణాలు హత్యల వరకు దారితీస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో గతేడాది కాలంగా 41కుపైగా హత్యలు, 156 హత్యాయత్నాలు, 30కి పైగా లైంగికదాడులు, దాడి యత్నాలు, దొంగతనాలు, దోపిడీలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. పాత నేరస్తులు ఇతర జిల్లాల్లోనూ దోపిడీలు, హత్యలకు పాల్పడి అక్కడి పోలీసులకు చిక్కిన ఘటనలూ ఉన్నాయని సమాచారం. పోలీసు శాఖలో రాజకీయ జోక్యం కారణంగా శాంతిభద్రతల పరిరక్షణ గాడి తప్పింది. నగరంలో రాత్రివేళ బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అనే భయం జనాల్లో పెరుగుతోంది.
● నెల్లూరురూరల్‌కు చెందిన మోహన్‌చందన్‌ను మద్యం తాగుదామని పిలుచుకెళ్లి ఆ మత్తులోనే స్నేహితులే హత్య చేసి పెన్నానదిలో పూడ్చారు.
● ఉదయగిరిలో బావను బావమరుదులు కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు.
● నగరంలో రౌడీషీటర్ భాను విష్ణువర్ధన్ తన అనుచరులతో నాగేంద్రపై కత్తులతో దాడిచేశారు.
● వైఎస్సార్‌సీపీ నేత, మాజీమంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు, పాత నేరస్తులు దాడి చేసిన ఘటన దీనికి నిదర్శనం. నిందితులెవరన్నది తెలిసినా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం పోలీసుల వ్యవస్థ ఎంత నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.
నేరస్తులకు అధికార పార్టీ అభయం
నేరస్తులకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. దీంతో నేరస్తులు నేరాలకు పాల్పడిన అనంతరం అధికార పార్టీ నేతలను ఆశ్రయించి పోలీసుస్టేషన్లలో లొంగిపోతున్నారు. పోలీసులు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. అధికార పార్టీ నేతలే కొందరు నేరాలకు ప్రోత్సహిస్తుండడంతో శాంతిభద్రతలకు పూర్తి స్థాయిలో విఘాతం ఏర్పడుతోంది. ఇటీవల మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో జరిగిన విధ్వంసకాండే నిదర్శనంగా నిలుస్తోంది. అఽధికార పార్టీ నేతల ప్రోద్భలంతో టీడీపీ మూకలు, పాతనేరస్తులు ప్రసన్న ఇంటిలో బీభత్సం సృష్టించారు. నిందితులెవరన్నది పోలీసులకు తెలిసినప్పటికి గుర్తుతెలియని వ్యక్తులంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అధికారానికి ఏ విధంగా గులాంగిరి చేస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఇప్పటికై నా పోలీసు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి. మత్తులోనే నేరాలు అధికంగా జరుగుతుండటంతో మద్యం అనధికార విక్రయాలు, గంజాయి విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడిచేయాలి. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు, పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచి వారిపై కఠినంగా వ్యవహరిస్తే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.
మత్తులో నేరాలు అధికమయ్యాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న మద్యం. విచ్చలవిడిగా జరుగుతున్న గంజాయి విక్రయాలు. దీంతో యువత మత్తుకు అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో జిల్లాలో 200 లైసెన్స్ మ ద్యం షాపులు ఉండగా అనధికారికంగా సుమారు 2 వేలకు పైగా బెల్టు షాపులు ఉన్నాయి. 24 గంటలు మద్యం అందుబాటులో దొరుకుతున్నాయి. గంజా యి విక్రయాలు విద్యాసంస్థల వరకూ విస్తరించాయి.అనేక విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా గంజాయి సరఫరా చేయడంలో బరి తెగిస్తున్నారు. పోలీసు అధికారులపైనా దాడులు చేసేందుకు వెనుకాడడం లేదు. మత్తులో నేరాలు అధికమయ్యాయి. మత్తులో విచక్షణ మరిచి అయిన వారిని, స్నేహితులను, ప్రత్యర్థులను అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. చిన్నారులను చిదిమేస్తున్నారు. మత్తు, ఇతర వ్యసనాలకు బానిసైన కొందరు తమ అవసరాల కోసం ప్రజలను కత్తులతో చంపుతామని బెదిరించి అందినకాడికి దోచుకెళుతున్నారు. మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నిషేధానికి ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థ మొక్కుబడి చర్యలకే పరిమితమైంది. కిరాయి సంస్కృతి పెరుగుతోంది. జిల్లాకు చెందిన కొందరు ఇతర జిల్లాల్లో హత్యలు, దోపిడీల కు పాల్పడుతూ అక్కడి పోలీసులకు చిక్కి జైలు పాలైన ఘటనలు లేకపోలేదు.

24/7 మద్యం, గంజాయి