
రవాణా అధికారుల విస్తృత తనిఖీలు
● రూ.2 లక్షల జరిమానాల వసూలు
నెల్లూరు (టౌన్): ఎలాంటి పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలను జిల్లా రవాణా అధికారులు తనిఖీ చేపట్టారు. శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్, ట్రిపుల్ రైడ్, నిబంధనలకు విరుద్ధంగా నంబరు ప్లేట్లు, వాహన పత్రాలు లేని 40 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.2.05 లక్షల అపరాధ రుసుం వసూళ్లు చేశారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు బాబు, రాంబాబు, కార్తీక్, ఏఎంవీఐలు పూర్ణచంద్రరావు, లాల్, స్వప్నిల్‌రెడ్డి, సంధ్య, మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా స్థాయి బ్యాడ్మింటన్
పోటీలు నేడు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శని వారం అండర్–11, 13, 15, 17, 19 సింగిల్స్, డబుల్స్, మెన్, ఉమెన్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ శుక్రవారం తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక కావడం జరుగుతుందన్నారు.
రౌడీషీటర్‌పై
పీడీయాక్ట్ నమోదు
నెల్లూరు (క్రైమ్): హత్యాయత్నం కేసులో జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న ఓ రౌడీషీటర్‌పై వేదాయపాళెం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. వెంగళరావునగర్‌కు చెందిన షేక్ యాసీర్ హత్యాయత్నం, కొట్లాట, వ్యక్తులను బెదిరించి నగదు దోచుకోవడం, మారణాయుధాలతో ఇతరులపై దౌర్జన్యం చేయడం వంటి ఘటనలకు సంబంధించి వేదాయపాళెం పోలీసుస్టేషన్‌లో ఆరు కేసులున్నాయి. పలుమార్లు తీరుమార్చుకోమని పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ చేసినా అతనిలో మార్పు రాకపోగా యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశాలతో యాసీర్‌పై వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసరావు పీడీయాక్ట్ నమోదు చేశారు. శుక్రవారం అతన్ని జిల్లా కేంద్ర కారాగారం నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
సంగంలో ఐటీఐ
కళాశాలను ప్రారంభిస్తాం
సంగం: సంగంలో ఐటీఐ కళాశాలను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, భవనాలను పూర్తి చేసి రెండు నెలల్లో తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సంగం మండలం తరుణవాయిలో ల్యాంకో ఫౌండేషన్‌కు చెందిన భవనాలను శుక్రవారం మంత్రి ఆనం పరిశీలించారు. ఆయన వెంట ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి పావని, తహసీల్దారు సోమ్లానాయక్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.