
సమస్యలపై చర్చించే తీరిక లేదా?
● జెడ్పీ సర్వసభ్య సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధుల డుమ్మా
● ఓవైపు యూరియా కొరతతో
రైతుల ఇబ్బందులు
● మరోవైపు బిల్లులు రాక కూలీల
ఆవేదన
● ఇవేమీ పట్టని కూటమి పెద్దలు
● పనులు ప్రారంభించకపోవడంపై చైర్‌పర్సన్ ఆవేదన
నెల్లూరు(పొగతోట): జిల్లాలో ప్రజలు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. రైతులు యూరియా దొరక్క రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. వీటిపై చర్చించేందుకు కొందరు కూటమి ప్రజాప్రతినిధులకు సమయమే దొరకలేదు. ఎంతో ముఖ్యమైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టారు. మూడునెలలకొకసారి నిర్వహించే సమావేశానికి మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీలు హాజరుకావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. కూటమి ప్రజాప్రతినిధుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముందుగా మాజీ చైర్మన్ బాలచెన్నయ్య మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. సభ ప్రారంభంలో జెడ్పీటీసీ సభ్యులు లేచి తమకు గౌరవ వేతనం రాలేదని, జనరల్ బాడీ నుంచి కేటాయించాలని తీర్మానం కోసం పట్టుబట్టారు. అరుణమ్మ స్పందించి పదినెలల గౌరవ వేతనం జనరల్ ఫండ్ నుంచి కేటాయిస్తామని తెలిపారు. మిగిలిన మొత్తం కోసం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ సభ్యులడిగిన వాటికి త్వరలో సమాధానం ఇస్తామన్నారు. జిల్లా పరిషత్‌లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు జెడ్పీలోనే కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు. ఇతర శాఖల్లో ఇచ్చేందుకు అవకాశం లేదని తెలిపారు. సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఉదయగిరి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర సమాచారంతో రావాలి
ముఖ్యఅతిథిగా విచ్చేసిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటే సమాధానం కూడా అదే రీతిలో ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను నేరుగా స్థానిక సంస్థలకే కేటాయిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో వెంకటగిరి నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లో మండల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారన్నారు. కొన్ని అసంపూర్తిగా ఉన్నాయని, మరికొన్ని ప్రారంభం కాలేదని, ఎందుకు జాప్యం జరుగుతుందో జెడ్పీ సీఈఓ కలెక్టర్‌కు వివరణ ఇవ్వాలని తెలిపారు. ఇకపై జరిగే సమావేశాలకు అధికారులు సమగ్ర సమాచారంతో రాకుంటే ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో రూ.48 కోట్లతో 33 దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
పనులు ప్రారంభించలేదు
చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ జిల్లాలో వివిధ మండలాల్లో పాఠశాలల భవన నిర్మాణాలకు, డీపీఆర్‌సీ భవనాలకు నిధులు ఇచ్చామన్నారు. ఒక్కపని ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీ గూడూరులో గ్రామంలో పాఠశాల కూలే స్థితికి వచ్చిందని, దాన్ని తొలగించాలని, మరో బడిలో వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఎనిమిది నెలల నుంచి అడుగుతున్నా ఫలితం లేదన్నారు. నెల్లూరు రూరల్ మండలంలో పాఠశాలకు రూ.16 లక్షలు ఇచ్చామన్నారు. శంకుస్థాపన విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని, కార్యక్రమానికి ఆహ్వానించలేదన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశామన్నారు. దీనికి సంబంధించి పీఆర్ ఎస్‌ఈ సరైన వివరణ ఇవ్వలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎవరేమన్నారంటే..
● కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి జెడ్పీ పాఠశాలకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురైందన్నారు. కొత్తగా విద్యుత్ మీటర్లు బిగించడంతో బిల్లులు అధికంగా వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు.
● వాకాడు జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బంది జాబ్‌కార్డులు కలిగిన పేదలకు పనులు కల్పించడం లేదన్నారు. పశువుల షెడ్లు నిర్మించకుండానే వివిధ ప్రాంతాల్లో బిల్లులు డ్రా చేశారన్నారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రశ్నించినందుకు నాన్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. పను లు కల్పించాలని అడిగినందుకు కేసులు బనాయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
● కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కలువాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. బడి గేటు ఎదుట చికెన్ స్టాల్స్ ఏర్పాటు చేశారని, వ్యర్థాలను ఆవరణలో వేస్తుండటంతో దుర్వాసన వస్తోందన్నారు. భారీ వర్షాల సమయంలో రోజుల తరబడి విద్యుత్ సరఫరా ఉండడం లేదన్నారు.

సమస్యలపై చర్చించే తీరిక లేదా?

సమస్యలపై చర్చించే తీరిక లేదా?